
ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొనే సత్తా గల నాయకత్వం ఉండాలి. గెలుపు గుర్రాలను ఎంచుకోవడంతో పాటు పార్టీలో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగలగాలి. తెలంగాణ కమలం పార్టీకి అటువంటి ఒక కొత్త కోచ్‌ని పంపించింది బీజేపీ జాతీయ నాయకత్వం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిపించడం కొత్త కోచ్ బాధ్యత. ఆ కొత్త కోచ్ ఎవరో? గతంలో ఆయన నిర్వహించిన బాధ్యతలేంటి..
తెలంగాణ బీజేపీకి కొత్త కోచ్ వచ్చేశారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న విజయాలు సాధించలేకపోయింది. నిజానికి గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓట్లు సీట్లు పెరిగిన మాట వాస్తవమే అయినా బీజేపీ అంతకు మించి ఆశించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండా పోటీలో బరిలో దిగడం వల్లనే ఆశించిన ఫలితాలు దక్కలేదని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును రిపీట్ చేయకూడదని నాయకత్వం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను నియమించారు. బీజేపీ కొత్త కోచ్ ముందు పెను సవాళ్లే ఉన్నాయి. పైకి కనిపించేంతటి తేలికైన జాబ్ అయితే కాదు ఆయనది.
చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టును ఎట్టకేలకు బీజేపీ హైకమాండ్ భర్తీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సంస్థాగత కార్యదర్శి లేకపోతే ఎదురైన ఇబ్బందులను అధిగమించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సంస్థాగత కార్యదర్శిగా బీఎల్ సంతోష్ ఎంత పవర్ ఫులో.. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి అంతే పవర్ ఫుల్. అంటే కొత్త కోచ్ చంద్రశేఖర్‌కు చాలా అధికారాలు ఉంటాయి. పార్టీని ఏకతాటిపై నడిపే క్రమంలో ఆయన తీసుకునే నిర్ణయాలే అంతిమం కానున్నాయి. వాటికి ఎదురు చెప్పే అధికారం ఎవరికీ ఉండదు.
ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి తెరవెనుక కీలకంగా పనిచేసిన చంద్ర శేఖర్‌ను తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్ సంస్థగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ సక్సెస్ ఫుల్ అయ్యారు. వసుంధర రాజే లాంటి రాటు దేలిన నేతలను పార్టీలో సైలెంట్ చేసిన చంద్ర శేఖర్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడంలో ఏదో ఆంతర్యం లేకపోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ రాజకీయ నిర్ణయాల్లో కఠినంగా వ్యవహరిస్తారని టాక్. ఒక్కసారి డిసైడ్ అయితే ఇక తన మాటను తానే వినడని పేరు. అందుకే తెలంగాణకి చంద్రశేఖర్ వంటి ముక్కుసూటి మనిషిని ఏరి కోరి మరీ ఎంపిక చేసింది నాయకత్వం.
గతంలో మంత్రి శ్రీనివాస్ తెలంగాణకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంజయ్‌కి మంత్రి శ్రీనివాస్‌తో పొసగలేదు. దీంతో మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్, హర్యానా సంస్థాగత కార్యదర్శిగా బదిలీ చేశారు. అప్పటి నుంచి కోచ్ లేకుండా తెలంగాణ బీజేపీ టీమ్ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసింది. నేతల మధ్య అంతర్గత కలహాలతో పార్టీలో రచ్చ కొనసాగుతోంది. ఈ తగాదాల కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్‌లు అనూహ్యంగా ఓడిపోయారు. అది బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ పరిస్థితి లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగకూడదన్న ఉద్దేశంతోనే చంద్రశేఖర్‌ను రంగంలోకి దింపారు కమలనాథులు.
నేతల మధ్య సమన్వయ లేమి సమస్యను అధిగమించి అత్యధిక పార్లమెంట్ సీట్లను సాధించడం కోచ్ ముందున్న పెద్ద సవాల్. బండి సంజయ్-ఈటల రాజేందర్‌ల మధ్య సయోధ్య లేదు. కిషన్ రెడ్డి వర్గానికి సంజయ్ వర్గానికి మధ్య మంచి సంబంధాలు లేవు. వీటన్నింటినీ సరిచేసుకుంటూ అందరినీ కలుపుకుపోతూ పార్టీకి విజయాలు తెచ్చిపెట్టాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కొత్త కోచ్.. టీమ్‌ను ఏ విధంగా ముందుకు నడుపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్ర శేఖర్ తెలంగాణ బీజేపీని గాడిలో పెడతారా? బదిలీపై మళ్ళీ వెళ్ళిపోతారా? అన్నది చూడాలి.