రెండున్నరేళ్ల పాలనలో అవినీతి అడ్డగోలుగా పెరిగింది
వాళ్ల స్కాంలను చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఓటేయరు
కేంద్రం గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనలు తెలపాలి
పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలతో సమీక్షలో కేటీఆర్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో భూ కుంభకోణాలు, అరాచకాలు మినహా ప్రజలకు చేసిందేమీ లేదు. ఆ పార్టీ అరాచకాలు చూసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసే అవకాశం లేదు. ఆ పార్టీ మరో 20 ఏళ్ల వరకు అధికారంలోకి రావడం కల్ల’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమిషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తుంది. మంత్రులే స్వయంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ఆక్రమణతోపాటు మైనింగ్ కుంభకోణాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసింది’అని దుయ్యబట్టారు. శనివారం నందినగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నేతలతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఎక్కడికక్కడ నిరసనలు: ‘ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.వెయ్యి పెంచింది. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. మరోసారి ఈ ధరలు పెంచకుండా ఉండేందుకు ప్రజలను జాగృతం చేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం
త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేటీఆర్ పార్టీ నేతలకు వివరించారు. ‘రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో బీఆర్‌ఎస్ చురుకైన పాత్ర పోషించబోతోంది. కాంగ్రెస్, బీజేపీ చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ప్రతీ ఒక్క యువతీ, యువకుడికి ఓటు హక్కు కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలి. కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు త్వరలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ ఎన్నికలకు సమాయత్తం కావాలి’అని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.


