అత్యాచార నిందితుల ఇళ్లు కూల్చేస్తాం

BJP state president Bandi Sanjay at Mahila Morcha meeting - Sakshi

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యూపీ తరహాలో చర్యలు

మహిళా మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతుచూస్తామని, యూపీ తరహాలో బుల్డోజర్లతో వాళ్ల ఇళ్లు కూల్చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. బుధవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ అమ్మాయిల విషయంలో తప్పుచేస్తే గుడ్లు పీకేస్తానని గతంలో సీఎం కేసీఆర్‌ చేసిన హెచ్చరికలన్నీ ఉత్తమాటలేనని విమర్శించారు.

మోదీ ప్రభుత్వం ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయడంతోపాటు మహిళలకు ఉన్నత పదవులిచ్చి గౌరవిస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ మహిళలు, బాలికలకు చితి పేర్చే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వెలిబుచ్చారు. ‘కేసీఆర్‌ చేతగానితనం వల్ల మెడికో ప్రీతి మరణిస్తే మహిళా మోర్చా దమ్ము చూపించింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.  సీఎంవో నుంచి వచ్చిన ఫోన్‌తో ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారు’ అని ఆరోపించారు.
 
షర్మిలను బూతులు తిట్టడం దారుణం.. 
‘నేను ఈ రోజు ఈస్థాయిలో ఉన్నానంటే నా శ్రీమతి గొప్పతనమే. వైఎస్‌ షర్మిలసహా పలువురు మహిళలను బీఆర్‌ఎస్‌ వారు దారుణంగా కించపరుస్తు న్నారు. ఆమె ఏ పార్టీ అయినప్పటికీ మహిళలను దూషించడం దారుణం’అని సంజయ్‌ అన్నారు.

‘జూబ్లీహిల్స్‌ ఘటన నుంచి ప్రీతి ఉదంతం వరకు అనేక అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా  కేసీఆర్‌ స్పందించరు. హోంమంత్రి ఉన్నారా లేరా? అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో మహిళలంటే కవిత మాత్రమేనా? నిధులు, దందాలన్నీ ఆమెకేనా?’అని సంజయ్‌ ప్రశ్నించారు. 

గెలిచే అవకాశం ఉన్న మహిళా నేతలకు టికెట్లు.. 
‘గెలిచే అవకాశమున్న మహిళా నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే బాధ్యత నాది. ఈసారి ఎక్కువ మంది మహిళా మోర్చా నేతలు ఎమ్మెల్యేలు కావా లని కోరుకుంటున్నా.  ప్రజల తరఫున కొట్లాడండి’ అని పిలుపునిచ్చారు. బీజేపీ సింహంలాగా ఒంటరిగానే పోటీచేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ప్రసంగించగా  నేతలు చింతల రామచంద్రారెడ్డి, పద్మజా మీనన్, నళిని, ఆకుల విజయ పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top