నిజామాబాద్: హైరదాబాద్ నగర పరిధిలో జరిగే జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి తాను రావడం లేదనే వ్యవహారంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జూబ్లీహిల్స్ ప్రచారానికి రాకపోయినా, సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ ప్రచారం చేస్తున్నానని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ప్రచారానికి రాలేదని అధిష్టానానికి ఫిర్యాదు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తన సోషల్ మీడియా బలంతో చేసే ప్రచారం కానీ వారు చేస్తున్నదానికంటే ఎక్కువగానే ఉందని స్పష్టం చేశారు.
‘ మేము గ్రామస్తులం. గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. జూబ్లీహిల్స్ ప్రచారానికి రావట్లలేదని నాపై ఫిర్యాదు చేయకండి రామచంద్రరావు గారు. నేను సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం.. మీరు ఫిజికల్‌గా చేస్తున్నదానికంటే ఎక్కువగానే ఉంది. నా సోషల్ మీడియా బలంతో నేను ఎన్నికల ప్రచారం చేస్తున్నా. జూబ్లీహిల్స్‌కు రావట్లేదని నాపై అధిష్టానానికి ఫిర్యాదు చేయకండి, అక్కడ మా నాయకులున్నరు. మా సీనియర్ నేతలు ఉన్నారు. మా ఎంపీలు ఉన్నారు. మా మంత్రులు కూడా ఉన్నారు. ఆ ప్రచారాన్ని వారు చూసుకుంటారు’ అంటూ వ్యాఖ్యానించారాయన.


