కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా
భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో అధికారంలోకి బీజేపీ
పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నా
కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సన్మానం
భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’గా మారుస్తామన్న బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 88 సీట్లలో గెలిచి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీభాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 36 శాతం ఓట్లు సాధించి బీజేపీ సత్తా చాటిందని చెప్పారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థుల తరఫున, విజయం సాధించిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల తరఫున పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కార్యకర్తలకు శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నానన్నారు. గురువారం రాత్రి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు యాదవ్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం, కృతజ్ఞతా సభను నిర్వహించారు.
అంతకు ముందు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు నగరంలోని ప్రధాన వీధుల మీదుగా దాదాపు మూడు గంటల పాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సన్మాన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేయాలి
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భగ భగమండిన ఎండల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి, అంకితభావంతో విజయం కోసం కృషి చేశారంటూ కిషన్‌రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా రాష్టంలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ జెండా చేతబూని, గ్రామగ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

సమన్వయంతో పనిచేస్తాం: కె.లక్ష్మణ్
తొలుత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..పలువురు నేతల త్యాగాల పునాదులపై పార్టీ నిలబడిందని చెప్పారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అందరం సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా పార్టీ కోసం ›ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు నిజమైన నివాళి అందిస్తామని అన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఘనంగా సన్మానం
పార్టీ కార్యాలయంలో పండిట్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చిత్రపటం వద్ద కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. తొలుత కె.లక్ష్మణ్‌ను కిషన్‌రెడ్డి, ఆ తర్వాత కిషన్‌రెడ్డిని లక్ష్మణ్ సన్మానించారు. అనంతరం బండి సంజయ్‌ను కిషన్‌రెడ్డి సత్కరించారు.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, మెదక్ ఎంపీ ఎం.రఘునందన్‌రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేష్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కిషన్‌రెడ్డి, సంజయ్‌లు కలిసి ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్, పైడి రాకేష్‌రెడ్డి, పాల్వాయి హరీ‹Ùబాబు, కాటిపల్లి వెంకట రమణారెడ్డిలను సత్కరించారు.
అమ్మవారి దయవల్లే గెలుపు: బండి
గురువారం రాత్రి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఇతర నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ చ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’గా మారుస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు చాలా పవర్ ఫుల్ అని, అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని అన్నారు.
ఈ రోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందని చెప్పారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టం మరువలేనిదన్నారు. కార్యకర్తలతో పాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. ఒకప్పటి సామాన్య కార్యకర్తలు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉండటం ఒక్క బీజేపీలోనే సాధ్యమని సంజయ్ అన్నారు.


