ఆపరేషన్‌ బెంగాల్‌.. దీదీకి ఓటమి తప్పదా? | BJP Gives Tough Fight In West Bengal To Mamata Banerjee | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ‘బెంగాల్‌’ దీదీ పరేషాన్‌

Jan 6 2021 9:43 AM | Updated on Jan 6 2021 5:13 PM

BJP Gives Tough Fight In West Bengal To Mamata Banerjee - Sakshi

సాక్షి ,న్యూఢిల్లీ : బెంగాల్‌ దంగల్‌లో దీదీని ఓడించడమే లక్ష్యంగా కమలదళం ఓ వైపు వ్యూహాలు రచిస్తుంటే, బిహార్‌ తరహాలో బెంగాల్‌లో బోణీ కొట్టేందుకు ముస్లిం ఓట్లను ఏకం చేసే పనిలో ఏఐఎంఐఎం (ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఇ–ఇత్తెహద్‌– ఉల్‌–ముస్లిమీన్‌) అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఉన్నారు. ఈ ఏడాది జరుగబోయే ఎన్నికల్లో దూకుడుగానే వ్యవహరించాలని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా పార్టీ కీలక నేతలు పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకొనే పనిలో బిజీగా ఉన్నారు. అందులోభాగంగానే టీఎంసీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి సహా ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అధికారి బీజేపీలో చేరడంతో అతని కుటుంబ ప్రభావం కనీసం 60 నుంచి 65 నియోజకవర్గాల్లో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాల్లో టార్గెట్‌ 200గా బీజేపీ నిర్ణయించుకుంది.

బిహార్‌ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ ఐదు సీట్లు గెలుచుకున్నప్పుడు, ఎంఐఎం బీజేపీ బి–టీం అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఎంఐఎం కారణంగా బీజేపీకి మాత్రమే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్‌ నాయకుడు అదిర్‌ రంజన్‌ చౌదరి అనేకసార్లు బాహాటంగా విమర్శించారు. ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్‌–మే నెలల్లో జరుగబోయే పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందనే ప్రకటన తర్వాత దాదాపు పది సంవత్సరాలు మైనారిటీ ఓటు బ్యాంకు మద్దతుతో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీలో అలజడి మొదలైంది. బిహార్‌ ఎన్నికల ఫలితాల తరువాత, బీజేపీని ఓడించేందుకు ముందస్తు ఎన్నికల కూటమి ద్వారా మమతా బెనర్జీకి ఒవైసీ స్నేహ హస్తం అందించేందుకు చేసిన ప్రయత్నం కాస్తా టీఎంసీ తిరస్కరణతో ఆగిపోయింది. అయితే, బీజేపీ నుంచి డబ్బులు తీసుకొని ఒవైసీ బెంగాల్‌లో అడుగు పెట్టారని మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే.

2006 నాటికి బెంగాల్‌లోని ముస్లిం ఓటు బ్యాంకును లెఫ్ట్‌ ఫ్రంట్‌ పూర్తిగా ఆక్రమించింది. కానీ ఆ తరువాత మైనార్టీలు క్రమంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో 2011, 2016 ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంకు కారణంగా మమత అధికారంలోకి వచ్చారు. రానున్న ఎన్నికల్లో.. హిందుత్వ ఎజెండాతో బెంగాల్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బీజేపీ సవాళ్లు ఒకవైపు.. కొత్తగా బెంగాల్‌ ఎన్నికల రాజకీయాల్లోకి ఒవైసీ సైతం మరోవైపు అడుగుపెడుతుండటంతో మమతా బెనర్జీకి కొత్త తలనొప్పి మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

31 శాతం ముస్లిం ఓటర్లు
పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలు అక్కడి జనాభాలో 31% ఉండగా, వారు 110 సీట్లలో ప్రభావవంతగా ఉన్నారు. దీంతో బిహార్‌ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన విధంగా ఇప్పుడు బెంగాల్‌ ఎన్నికల్లో తన ముద్ర వేసేందుకు ఒవైసీ సిద్ధమయ్యారు. ఆదివారం çపశ్చిమబెంగాల్‌ పర్యటనకు వెళ్ళిన ఒవైసీ హుబ్లీలో, సింగూర్‌ – నందిగ్రామ్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఫుర్‌ఫురా షరీఫ్‌ దర్గాకు చెందిన పిర్జాదా అబ్బాస్‌ సిద్దిఖీతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ మధ్య కాలంలో అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న అబ్బాసుద్దీన్‌ సిద్దిఖీ నాయకత్వం లో ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఓవైసీ భేటీ తర్వాత మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో ఎంఐఎం ఏవిధంగా పోటీ చేస్తుందనే విషయాన్ని సిద్దిఖీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. దీంతో ముస్లిం ఓటు బ్యాంకు ఎన్నికల్లో గేమ్‌ఛేంజర్‌గా మారనుంది. 

తృణమూల్‌కు కష్టాలు తప్పవా
ఒవైసీ కారణంగా బీజేపీ తన పూర్తి ప్రయోజనాన్ని పొందే అవకాశాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా బెంగాల్‌లో బీజేపీ ప్రయత్నిస్తున్న హిందూ ఓటు సంఘటితమైతే, తృణమూల్‌ కాంగ్రెస్‌కు సమస్యలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముస్లిం జనాభా మాల్డాలో 51%, ముర్షిదాబాద్‌లో 66%, నాడియాలో 30%, బిర్భూమ్‌లో 40%, పురులియాలో 30%, తూర్పు– పశ్చిమ మిడ్నాపూర్‌లో 15% ఉంది. అటువంటి పరిస్థితిలో దూకుడుగా దూసుకెళ్ళేందుకు సిద్ధమైన బీజేపీ ప్రయత్నాలు విజయవంతమైతే హిందూ ఓట్లు ఏకీకృతం అవుతాయని, ముస్లిం ఓట్ల కారణంగా మిగతా సీట్లలో పార్టీల మధ్య ఓట్ల విభజన జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

బెంగాల్‌ రాజకీయాల్లో ఒవైసీకి స్థానం లేదు’
పశ్చిమ బెంగాల్‌లో 2011 నుంచి అధికారంలో ఉన్న మమతా మైనారిటీలకు నిరంతరం సహాయపడేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. మైనారిటీల మదర్సాలకు ప్రభుత్వ సహాయం, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మౌల్వీలకు ఆర్థిక సహాయం వంటి పథకాలను మమత ప్రారంభించారు. ఇçప్పుడు ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవ్వడంతో సమీకరణాలు మారే అవకాశం ఉందని రాష్ట్ర ముస్లిం నాయకులు భావిస్తున్నారు. అయితే, బెంగాల్‌ రాజకీయాల్లో ఒవైసీకి స్థానం లేదని టీఎంసీ ప్రభుత్వ మంత్రి, బెంగాల్‌కు చెందిన ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్‌ ఉలామా ఎ హింద్‌ నాయకుడు సిద్దికుల్లా చౌదరి అన్నారు. ఎంఐఎం ముస్లింలలో విభజనను సృష్టించేందుకు చేస్తున్న వ్యూహం పనిచేయదని సిద్ధికుల్లా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement