
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘దేశహితం కోసం బంధాలను వదులుకుని త్యాగాలు చేస్తూ నిస్వార్థంగా జీవిస్తున్న ప్రచారక్ బీఎల్ సంతోష్‌పైనే కేసు పెడతావా? దేశ రక్షణకు సరిహద్దుల్లో సైనికుల మాదిరిగా దేశం కోసం పనిచేసే గొప్పవ్యక్తి సంతోష్‌జీ. తన లాంటి అనేక మంది కార్యకర్తలను తయారుచేసిన వ్యక్తిని నోటీసుల పేరుతో వేధించి కేసులు పెడతారా? ఖబడ్దార్ కేసీఆర్... నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు‘ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా హెచ్చరించారు.
‘సంతోష్‌జీ ఏం తప్పు చేశారు? ఆయనకు మీ మాదిరి ఆస్తిపాస్తుల్లేవు. విదేశాల్లో మీలెక్క పెట్టుబడుల్లేవు. బ్యాంకు ఖాతాల్లేవు. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబం కోసం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రచారక్ వ్యవస్థనే కించపరుస్తావా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఓ రిసార్ట్స్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గభేటీ ముగింపు సందర్భంగా సంజయ్ మాట్లాడారు.
‘సంతోష్ కుటుంబ బంధాలకు దూరంగా ప్రజలకు సేవ చేసేందుకు, కేసీఆర్ వంటి మూర్ఖుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను రక్షించేందుకు ప్రచారక్‌గా పనిచేస్తున్నారు. అలాంటి ప్రచారక్ వ్యవస్థను బెదిరిస్తూ కేసులు పెడుతుండటం సిగ్గు చేటు. అలాంటి వాళ్ల జోలికొస్తే ఖబర్దార్’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు సంజయ్ భావోద్వేగానికి గురికావడంతో ఆయన గొంతు జీరబోయింది. సంజయ్ ప్రసంగాన్ని చూసి పలువురు రాష్ట్రకార్యవర్గసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.
గొల్లకొండ కోటపై కాషాయజెండా
పార్టీ భేటీలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా... ఎంపీ సోయం బాపూరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీలు నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి బలపరుస్తూ కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ‘ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు బీజేపీదే.
నీ నిజాం రాచరిక పాలనను అడ్డుకుంటాం. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. యుద్ధానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధం. నీ కుట్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. నీ కుటుంబ అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని పేర్కొ న్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా కాంగ్రెస్ అంతమైందని, వాళ్లకు వాళ్లే కూల్చుకుంటారని ఎద్దేవా చేశారు.
మళ్లీ మోసపు హామీలు
‘వక్రభాష్యాలతో నమ్మించి మోసం చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పులపాల్జేసిన కేసీఆర్ మళ్లీ మోసపు హామీలతో అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. ఒకవేళ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే అప్పుల కుప్ప పెరగడం తప్ప చేసేదేమీలేదు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘సిద్ధాంతం, విధానం, పద్ధతి లేని పార్టీ టీఆర్‌ఎస్. తెలంగాణ ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. కేసీఆర్ పాలనలో చిప్ప చేతికిచ్చి అడుక్కునే స్థాయికి దిగజార్చారు. పుట్టబోయే ప్రతీ బిడ్డపై లక్షా 50 వేల అప్పు చేశారు. పెళ్లిచేసుకున్నా పిల్లల్ని కనలేని దుస్థితి’ అని పేర్కొన్నారు. ‘కేసీఆర్ పాలన పుణ్యమా అని ఏటా రూ.30 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారు. మళ్లీ అవకాశమిస్తే, మరో 5 లక్షల కోట్ల అప్పు చేసి అప్పులు కట్టడానికే పరిమితమవుతారు తప్ప ప్రజలకేమీ చేయరు’ అని చెప్పారు.