
సాక్షి, పెద్దపల్లి: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రుల్లో వీల్‌చైర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని, సీఎం కేసీఆర్ కు భజన చేసే కార్యక్రమాలకు మాత్రం ముందుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఆయన తన శాఖను వదులుకుని ప్రత్యేకంగా భజన శాఖను ఏర్పాటు చేయించుకుని తీసుకోవా లని ఎద్దేవా చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ సోమవారం రామగుండం నియోజకవర్గ పరిధి ఆకేనపల్లిలో కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు.
మహిళలు రుణం దేనికి తీర్చుకోవాలి..?
‘హరీశ్‌రావు.. ఐకేపీ మహిళలు కేసీఆర్ రుణం దేనికి తీర్చుకోవాలి? అభయహస్తం పథకం అటకెక్కించినందుకా..? ఆమ్ ఆద్మీ బీమా యోజన తొలగించినందుకా? స్వశక్తి సంఘాల పిల్లలకు స్కాలర్‌షిప్ పథకాన్ని తీసివేసినందుకా? వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా మహిళలను మోసం చేసినందుకా? ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించినందుకా? దళితబంధు రూ.17,700 కోట్లు కేటాయించి ఏడాది పూర్తయినా విడుదల చేయనందుకా..? ఎందుకు రుణం తీర్చుకోవాలి.. క్షీరాభిషేకాలు ఎందుకు చేయాలి?..’అని భట్టి మండిపడ్డారు.
అధికారంలోకి వస్తే ప్రాణహిత – చేవెళ్ల
రూ.1.25 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించామని బీఆర్‌ఎస్ పాలకులు గొప్పలు చెప్పడం తగదని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీటిని లక్ష్మీకాలువ, సరస్వతి కాలువ, కాకతీయ కాలువల్లో పారించి కాళేశ్వరం ద్వారా నీటిని ఇస్తున్నామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటని సీఎల్పీ నేత విమర్శించారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు ఇచ్చారా..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెబుతూ ఇదే రోల్‌మోడల్ అంటూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్‌ఎస్.. దేశంలో కూడా ఇదే మాదిరిగా సంపదను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తోందని భట్టి ఆరోపించారు.