Bandi Sanjay Emotional Post: కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా ముగించాల్సి వస్తుంది.. బండి మనసులో ఏముంది?

Bandi Sanjay Emotional Tweet After Steps Down As Telangana BJP Chief - Sakshi

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా తర్వాత 

బండి సంజయ్‌ ఉద్వేగభరిత ట్వీట్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించడంతో బండి సంజయ్‌ ఉద్వేగభరితమైన ట్వీట్‌ చేశారు. ‘మన జీవితాల్లో కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా ముగించాల్సి వస్తుంది’ అంటూ పేర్కొన్నారు.

తన పదవీకాలంలో ఒకవేళ ఎవరినైనా అనుకోకుండా బాధపెట్టి ఉన్నప్పటికీ అన్యదా భావించకుండా అందరి ఆశీస్సులను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తనది బాధాకర కథ కానందున సంతోషంగా ఉన్నానని.. తనపై దాడులు, అరెస్టుల సమయంలో నేతలంతా అండగా నిలిచి తనకు మధురానుభూతులు మిగిల్చారన్నారు.

కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటంలో అరెస్టులు, దాడులను ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలబడ్డ బీజేపీ కార్యకర్తలందరికీ హ్యాట్సాఫ్‌ తెలుపుతున్నానన్నారు. సుఖదుఃఖాల్లో కార్యకర్తలంతా తన వెంట నిలిచారని... తాను సైతం ఎల్లప్పుడూ వారిలో ఒకడిగా ఉన్నానని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. 
(చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?)

అవకాశం ఇచ్చిన అగ్రనేతలకు ధన్యవాదాలు... 
తనలాంటి సాధారణ కార్యకర్తకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచి్చనందుకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్, శివప్రకాశ్, తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్, అరవింద్‌ మీనన్‌లకు బండి సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. కాగా, బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించడాన్ని తట్టుకోలేక బీజేపీ ఖమ్మం టౌన్‌ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్‌ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  

బీజేపీ పరిణామాలపై నాయకుల స్పందనలు ఇలా...
► ‘బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన జి.కిషన్‌రెడ్డికి అభినందనలు... బండి సంజయ్‌ నాయకత్వంలో పార్టీ బాగా పనిచేసింది. కిషన్‌రెడ్డి నేతృత్వంలో అధికారాన్ని సాధిస్తుంది’
– దుబ్బాక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు

► బండి సంజయ్‌ మార్పు బాధాకరమే అయినా, పార్టీ మరింత మంచి బాధ్యతను ఆయనకు అప్పగిస్తుందని భావిస్తున్నా.
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి

► బండి మార్పుపై కార్యకర్తలు భావోద్వేగాలకు గురికావొద్దు. ఎవరూ ఎలాంటి చర్యలకు దిగొద్దు. సంజయ్‌కు పార్టీనాయకత్వం సముచిత గౌరవం కల్పిస్తుంది.
–  బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకరరెడ్డి

ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి...
హంపిలో జరగనున్న జీ–20 సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం బెంగళూరుకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చివరకు ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో పాటు బుధవారం కేంద్ర కేబినెట్‌ భేటీ నేపథ్యంలో అక్కడకు వెళ్లినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...దానిపై ఆయన మీడియాతో ఎలాంటి కామెంట్‌ చేసేందుకు ఇష్టపడలేదు. రెండు మూడు చోట్ల ఆయన స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా మౌనమే సమాధానమైంది.

బండి ఛాంబర్‌ ఖాళీ...ఆఫీస్‌ కారు అప్పగింత...
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనకు అందిన ఫార్చునర్‌ వాహనాన్ని పార్టీ కార్యాలయా నికి బండి సంజయ్‌ తిప్పి పంపించారు. అదే విధంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడి చాంబర్‌ను ఖాళీ చేశారు.

బండి అవినీతిపై విచారణ జరపాలి.. పోలీసులకు కరీంనగర్‌ కార్పొరేటర్‌ ఫిర్యాదు
కరీంనగర్‌: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్‌పై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ కమల్‌జిత్‌ కౌర్‌ సోహన్‌సింగ్‌ కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమల్‌జిత్‌కౌర్‌ సోహన్‌సింగ్‌ మాట్లాడుతూ గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ బండి సంజయ్‌ పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పారని.. ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 

‘బీజేపీకి బీసీలు గుణపాఠం చెబుతారు’
కాచిగూడ (హైదరాబాద్‌): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలహీన వర్గాలను బలిచేస్తోందని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకీ బలహీన వర్గాల ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్‌ రావు హెచ్చరించారు. ఆయా మంగళవారం కాచిగూడలోని మహాసభ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.
(చదవండి: కేసీఆర్‌ బలం, బలహీనతలు తెలుసు: ఈటల)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top