
కరీంనగర్ టౌన్: బీఆర్‌ఎస్‌ను ప్రజలు రద్దు చేశారని, గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్‌ఎస్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఒక మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని, గవర్నర్ పర్యటనకు ప్రొటోకాల్ పాటించలేదని మండిపడ్డారు.
గవర్నర్ అంటే రబ్బర్ స్టాంపులా ఉండాలనుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు తమ తమ రాజ్యాంగాలను మార్చుకున్నాయని, భారత్ మాత్రం రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించినా మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చలేదని సంజయ్ గుర్తుచేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ది మూడో స్థానమేనని, ఇంకా గూండాగిరి చేస్తాం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు బీఆర్‌ఎస్ నేతలపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.