చంద్రబాబు, సీపీఐ కవల పిల్లలు

Anil Kumar Yadav Fires On Chandrababu And CPI - Sakshi

పోలవరం ఎత్తు తగ్గించబోమని చెప్పినా పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు

అనుమానాలుంటే ప్రాజెక్టు పూర్తయ్యాక చంద్రబాబు, రామకృష్ణ వెళ్లి కొలుచుకోవచ్చు

బాబు ఎజెండా కోసమే ఆయన పోరాటం

నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రజల కోసం పనిచేయకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎజెండా కోసమే సీపీఐ నేత రామకృష్ణ పోరాటం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు, సీపీఐ కవల పిల్లలుగా తయారయ్యారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. పేద ప్రజలు, రాష్ట్ర సమస్యల కోసం పోరాటాలు చేసేవి.. వామపక్షాలు. కానీ రామకృష్ణ ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద మూడు వేల మంది పనిచేస్తూంటే 200 మందితో అక్కడికి వెళ్లి రచ్చ చేయడం సీపీఐకి అవసరమా? బలప్రదర్శనకు వెళుతున్నారా? లేక అనుమానాల నివృత్తి కోసం వెళ్తున్నారా? అక్కడికి వెళ్లి రాజకీయం చేయడం, బురద జల్లడం తప్ప చేసేదేమిటి? అనుమానాలుంటే సీపీఐకి చెందిన ఒకరో, ఇద్దరో వెళ్లండి. అధికారులు ప్రాజెక్టు పనుల గురించి వివరిస్తారు. ప్రాజెక్టుపై రాజకీయం చేయాలి.. రచ్చ చేయాలి.. ప్రజల్లో అపోహలు కల్పించాలి అని అనుకుంటే మాత్రం కచ్చితంగా ప్రభుత్వం అడ్డుకుంటుంది.  పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించబోమని గతంలోనే చెప్పినా పదే పదే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రామకృష్ణకు అనుమానాలు ఉంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక చంద్రబాబుతో వెళ్లి కొలుచుకోవచ్చు. 

చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరు?
పోలవరం ప్రాజెక్టుకు నష్టం చేకూర్చేలా.. 2017లో కేంద్ర కేబినెట్‌లో నోట్‌ పెడితే చంద్రబాబు అంగీకరించిన విషయాన్ని రామకృష్ణ ఎందుకు ప్రశ్నించరు? కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తి కోసం ఎందుకు తీసుకున్నారని కూడా అడగరు. చంద్రబాబు పాలనలో పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌లో భాగంగా నిరాశ్రయులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క ఇల్లు కట్టకపోయినా ఎందుకు మాట్లాడలేదు? ప్రాజెక్టుపై అనుమానాలు ఉంటే.. అన్ని పార్టీల నుంచి ఇద్దరేసి చొప్పున రండి.. ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేసిన దరిద్రపు పనులపై రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లు కేంద్రం తగ్గించడానికి కారణం బాబు కాదా? ప్రధాన డ్యామ్‌ను వదిలేసి కాఫర్‌ డ్యాంను 41 మీటర్లకు కట్టేసి డ్యామ్‌ పూర్తయిందని చెప్పాలన్న కుట్రలను రామకృష్ణ ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు చేసే దుష్ప్రచారాలను నమ్మి ఆయన అడుగేస్తారు. ఇదే చంద్రబాబు 41 మీటర్లు ఎత్తు వరకు కట్టి, కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు ఇస్తామన్నప్పుడు.. దాన్ని ‘ఈనాడు’లో ప్రచురించినప్పుడు వాటి గురించి రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? పోలవరంలో వేలాది మంది పనులు చేస్తున్నప్పుడు వందల మందిని పంపి రాజకీయం చేయడానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇంగితజ్ఞానం లేదా? బాబుకు మతిభ్రమించింది. వచ్చే ఏడాది ఆఖరుకు పోలవరం ప్రాజెక్టు నిర్మించి, కుడి, ఎడమ కాలువల్లో నీళ్లు పారిస్తాం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top