ఊహించని పరిణామం.. ఉద్దవ్‌తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భేటీ.. దేనికి సంకేతం!

Ahead Of BMC Polls Arvind Kejriwal Uddhav Thackeray Meet In Mumbai - Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. శివసేన(ఉద్దవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) అధినేత ఉద్దవ్‌ ఠాక్రేను కలిశారు. ముంబైలోని బాంద్రాలో ఉద్దవ్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఎంపీలు రాఘవ్‌ చద్దా, సంజయ్‌ రౌత్‌లు కూడా పాల్గొన్నారు. 

కేజ్రీవాల్‌కు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే, భగవంత్‌మాన్‌ దగ్గరుండి స్వాగతం పలికారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఆదిత్య ఠాక్రే ట్విటర్‌లో షేర్‌చేశారు. తమ ఆహ్వానాన్ని అంగీకరించి టీ తాగూందేరేమాతోశ్రీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఉద్దవ్‌ మాట్లాడుతూ.. దేశాన్ని బలోపేతం చేసే మార్గాలపై  నేతలంతా చర్చించినట్లు  తెలిపారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు వెల్లడించారు.  మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించున్నట్లు పేర్కొన్నారు. మూడేళ్లుగా ఉద్ధవ్‌ను కలవాలనుకుంటున్నా కోవిడ్ తదితర కారణాల వల్ల కలవలేకపోయానని కేజ్రీవాల్ చెప్పారు. శివసేన పార్టీ పేరును, గుర్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే వర్గం లాక్కుందని విమర్శించారు. ఠాక్రేకు మద్దతిస్తూ.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఉద్ధవ్‌ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఉద్ధవ్‌తో ఆప్ అధినేత సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌(బీఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి జోష్‌లో ఉన్న ఆప్‌.. బీఎంసీ ఎన్నికలపై సైతం దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ ఎన్నికల్లో ఆప్‌, ఉద్దవ్‌ శివసేన రెండూ కలిసి పోటీ చేసే అవకాశమూ లేకపోలేదు. అయితే ప్రస్తుతానికి దీనిపై స్పష్టత రాలేదు. ఇదే విషయంపై కేజ్రీవాలన్‌ను ప్రశ్నించగా.. ఎన్నికలు వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని అన్నారు.

కాగా ఇటీవలే సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గాన్నే అసలైన శివసేనగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ గుర్తు విల్లు బాణాన్ని సైతం షిండే వర్గానికే కేటాయించింది. ఇది జరిగిన వారం రోజుల్లోనే కేజ్రీవాల్‌, ఉద్దవ్‌ను కలవడం విశేషం. వీరి భేటీ బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top