పెద్దపల్లి: ప్రజాప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు రాజయ్య.. తనకు 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, బ్రిక్స్ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బూడిదతో పొలంలో వేసే కూరగాయల పంటకు నష్టం వస్తుందన్నారు. ఇందుకు కారణమైన బ్రిక్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి హనుమాన్‌నగర్‌కు చెందిన ఎర్రం వరలక్ష్మి.. తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, తన పోషణ ఎవరూ పట్టించుకోవడం లేదని, వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పట్టణానికి చెందిన కుమారస్వామి.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరాడు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్లకు చెందిన ఎర్రబెల్లి రాజేశ్వరరావు.. సర్వే నంబరు 330 నుంచి 331లోని కాలువలో మట్టి తీయాలని అర్జీపెట్టారు. పెద్దపల్లి విద్యానగర్‌కు చెందిన విఠల్.. గృహజ్యోతి పథకం అమలు చేయాలని కోరాడు.
ప్రభుత్వ ఆస్పత్రిలో సత్వర సేవలు
ప్రభుత్వ ఆస్పత్రిలో సత్వర వైద్యసేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. వైద్యశాఖ పనితీరుపై తన కార్యాలయంలో సమీక్షించారు. రోజూ ఉదయం 9.30 నుంచి 11.00 గంటల వరకు ఓపీ రిస్ట్రేషన్ చేయడం ద్వారా ఎక్కువమందికి సేవలు అందించలేకపోతున్నామని, ప్రతీవిభాగంలో నిర్దిష్ట సంఖ్యలో టోకెన్‌లు జారీచేసి ఓపీ సేవలు పెంచాలని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని కలెక్టర్ సూచించారు. ఉదయం తీసుకున్న శాంపిళ్ల నివేదికను సాయంత్రం వరకు పేషెంట్లకు తెలియజేయాలని అన్నారు. ఎక్స్‌రే యంత్రం, సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు అందించాలని చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్, డీసీహెచ్‌వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
అత్యున్నతమైనది ఉపాధ్యాయ వృత్తి
ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనదని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల ఎంపీసీఎస్ ఉపాధ్యాయురాలు మిరియాల సుజాత– ఉద్యోగ విరమణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన బోధన విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసిందని ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ –అబ్బయ్యగౌడ్, ఎంఈవో రాజయ్య, టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, కాంప్లెక్స్ హెచ్‌ఎం కవిత, రత్నాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


