గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని, నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని కార్మికులను మభ్యపెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు కార్మికుల నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టిందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 13వేల మందిని ఉద్యోగాల్లో తీసుకున్నారని, దీనిలో అవకతవకలు జరగాయని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన నియామకాలు 1,900మంది మాత్రమేనని పేర్కొన్నారు. రెండేళ్లుగా విజిలెన్స్, ఏసీబీ పేరుతో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులను మెడికల్ బోర్డుకు పిలవకుండా నిలిపివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. 2వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం వేచిచూస్తున్నారన్నారు. సింగరేణి కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈనెల 28న గనులు, డిపార్ట్‌మెంట్లపై నల్లబ్యాడ్జీలతో నిరసన, 30న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట నిరసన, ఆ తర్వాత సింగరేణి, ప్రజాభవన్ ముట్టడి చేపడతామని ఆయన వివరించారు.


