గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్ర చేస్తున్నాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబు వారసత్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోల్డెన్ హ్యాండ్‌షేక్ పేరిట పదివేల మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించిందని గుర్తుచేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 13 వేల మందిని ఉద్యోగాల్లో తీసుకున్నారని, ఇందులో అవకతవకలు జరగాయనడం హాస్యాస్పదమన్నారు. సంస్థలో చోటుచేసుకుంటున్నఅవినీతి, అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు, నిధుల దుర్వినియోగంపై పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని కోరారు. టీబీజీకేఏస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, కోశాధికారి చెల్పూరి సతీశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, పోలాడి శ్రీనివాసరావు, చల్లా రవీందర్‌రెడ్డి, వాసర్ల జోసఫ్, జనగామ మల్లేశ్, పల్లె సురేందర్, పులిపాక సంపత్ తదితరులు పాల్గొన్నారు.


