మంథని: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం ఉన్నా విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు. తక్కువ పరిమాణంగల ప్లాస్టిక్ కవర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉండడంతో అనేకమంది వాటినే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, నిత్యావసరాలకు వాడే పాలితిన్ కవర్లు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో లేవు. ఫలితంగా ప్రజలు తప్పనిసరి బట్ట సంచులు, బుట్టలతో మార్కెట్‌కు వస్తున్నారు.
చేతి సంచులతో సందడి
పాలితిన్ కవర్ల కొరతతో పట్టణంలోని కూరగాయల మార్కెట్‌తోపాటు కిరాణాల్లో నిత్యావసరాలు తీసుకెళ్లే ప్రజలు చేతిసంచులు, బుట్టలతో సందడి చేస్తున్నారు. గతంలో చేతిసంచులు, బుట్టలతోనే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకెళ్లే జనం.. ఇప్పుడు పాతరోజులను గుర్తుచేసుకుంటున్నారు. చేతి సంచులు, బుట్టలతో వచ్చే కస్టమర్లను ఆకర్శించడానికి వ్యాపారులు కొత్తిమీరకట్ట, ఆకుకూర కట్టలను ఉచితంగా అందిస్తున్నారు.
ఇలా కొనసాగితే..
క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని అధికారులు ఎన్నిమార్లు విన్నవించినా.. కొన్ని మున్సిపాలిటీల్లో జరిమానాలు విధిస్తు న్నా ప్రజలు, వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. కానీ, యుద్ధం నేపథ్యంలో పాలితిన్ కవర్ల దిగుమ తికి ఆటంకం ఏర్పడింది. వాటి కొరతతో ప్రజలు పాతరోజుల్లో మాదిరిగా బుట్ట, బట్ట సంచులను వినియోగిస్తున్నారు. ఇదే పద్ధతిని జనం అలవాటు చేసుకుంటే అనేక అనర్థాల నుంచి దూరం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బట్ట సంచిలో కూరగాయలు తీసుకెళ్తున్న స్థానికులు
ప్లాస్టిక్ కవర్లకు కొరత తీవ్రతరం
మార్కెట్లపై యుద్ధ ప్రభావం


