సాక్షి పెద్దపల్లి:
సుమారు పదహారేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, పర్యవేక్షణ అధికారులు, సామగ్రి తదితర అంశాలపై దృష్టి సారించింది. సిబ్బంది నియామకం, గ్రామాల వారీగా మ్యాప్‌ల తయారీ తదితర వాటిపై కసరత్తు చేస్తోంది. ఇది దేశంలో తొలిసారి పూర్తిగా డిజిటల్ పద్థతిలో జరిగే జనగణన కావడం గమనార్హం.
మొబైల్ ఫోన్లలో నమోదు
ఈసారి డిజిటల్ విధానంలో జనగణన చేపట్టనుండడంతో ఎన్యూమరేటర్లు తమ మొబైల్ ఫోన్లలోని ప్రత్యేక యాప్ లేదా పోర్టల్ ద్వారా సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ప్రజలు కూడా స్వయంగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, ఎక్కడ కూడా డబుల్ ఎంట్రీలు ఉండకుండా పర్యవేక్షించేందుకు అధికారులకు శిక్షణ ఇచ్చారు.
రెండు విడతలుగా గణన
జన గణనకు కేంద్ర హోంశాఖ గతేడాది జూన్‌లోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2027 మార్చి ఒకటో తేదీ నాటికి రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలిదశలో ఇళ్ల జాబితాను వెలువరించి, రెండోదశలో జన గణన చేపడతారు. సాధారణంగా పదేళ్లకోసారి జనాభా లెక్కలు సేకరించాలి. చివరిసారిగా 2011లో జన గణన నిర్వహించారు. ఆ తర్వాత 2021 లె క్కించాల్సి ఉండగా, 2020లో కోవిడ్ నేపథ్యంలో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 16వ జనగణనకు రంగం సిద్ధమైంది. జనగణనతోపాటు ఈసారి కుల గణన, జాతీయ పౌర పట్టిక (నేషనల్ సివిల్ రిజిష్టర్) ఒకేసారి చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మే 11 నుంచి నివాసాల గుర్తింపు
ఈఏడాది తొలుత నివాసాల గుర్తింపు (హౌస్ లిస్టింగ్) ప్ర క్రియ చేపడతారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ప్రణాళిక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సరిపోల్చుతారు. 2027 ఫిబ్రవరిలో ఇంటింటికీ వెళ్లి జన గణన చేపడతారు. ఫిబ్రవరి 28 తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు జన్మించిన వారివివరాలనూ నమోదు చేస్తారు. మార్చి ఒక టో తేదీ వరకు జనగణన ప్రక్రియ ముగుస్తుంది. గణకులు గా నియమితులయ్యే వారికి త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు.
ఇంటింటికీ రెండు దఫాలుగా..
ఈసారి మొబైల్ యాప్‌లో జనాభా వివరాలు నమోదు చేస్తారు. ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటికి రెండుదఫాలుగా వెళతారు. తొలిసారి నివాసాలను లెక్కిండంతోపాటు కుటుంబ స్థితిగతులు, ఆస్తులు, ఆదాయం, వసతులు వంటివి సేకరిస్తారు. రెండోదశలో జనాభా వివరాలు సేకరించేందుకు ఇంటింటికీ వెళతారు. కుల, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమాచారం సేకరిస్తారు. ఏ ఇంట్లో ఉంటున్నారు? ఏం తింటున్నారు? ప్రధాన తాగునీటి వసతి ఏమిటి? వంట చేయడం కోసం ఏ ఉపయోగిస్తున్నారు? మరుగుదొడ్డి సౌకర్యం ఉందా? తదితర 33 ప్రశ్నలు అడిగి వివరాలు నమోదు చేస్తారు.
అన్నింటికీ ఇదే ఆధారం
రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లతో పాటు మహిళా రిజర్వేషన్, కేంద్రప్రభుత్వం రాష్టాలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే పథకాలకు జనాభా లెక్కలు కీలకం కానున్నాయి. అందుకే పొరపాట్లు తలెత్తకుండా జనాభా లెక్కలు ప్రక్రియకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
అధికారులకు బాధ్యతలు
కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్‌వో, సీపీవో సహా రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరోఅధికారితో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దార్ జనగణన అధికారిగా వ్యవహరిస్తే.. ఏఎస్‌వో (అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్) సహాయకుడిగా పనిచేస్తారు. గణకులు (ఎన్యూమరేటర్లు)గా ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తారు. ఐదారుగురు గణకులకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు.
ఎక్కడుంటున్నారు?
మీ ఆదాయం ఎంత?
మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా?
మొదలైన జనాభా లెక్కల సన్నాహాలు
ఈఏడాది నివాసాల గుర్తింపు
వచ్చే ఏడాది జనాభా లెక్కింపు
తొలిసారి డిజిటల్ విధానం అమలు


