● నేడు ఉగాది పర్వదినం
కోల్‌సిటీ(రామగుండం): వనాలన్నీ చిగురించే వేళ, పూల పరిమళాలు వెదజల్లే సమయాన.. లేలేత చివుళ్లు వేసి... కోయిలమ్మల కుహు కుహూ రాగాలు .. హాయినిచ్చే వెచ్చని గాలులు.. వచ్చేది వసంతం.. ఆరు రుతువుల్లో ఇది ప్రత్యేకం. తెలుగు సంవత్సర ఉగాదిని ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడం అనవాయితీ. నేటి నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆరంభం కానుంది. ‘పరాభవ నామ సంవత్సరం’ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సామాజిక, జీవన మార్గదర్శక భావనలను అందిస్తుంది. ‘పరాభవ’’ అనే పదానికి సాధారణంగా ‘పరాజయం’ అనే అర్థం ఉన్నప్పటికీ, ఇది మన లోపాలను గుర్తించి, వాటిని జయించి, విజయానికి పునాది వేయాలని సూచిస్తుంది. నేడు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరపనున్నారు.


