పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయానికి సొంతభవనం కరువైంది. అనూహ్యంగా జిల్లాగా అవతరించిన పెద్దపల్లి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయాక తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని ఓ భవనం కేటాయించారు. తొలిజెడ్పీ పాలకమండలి పదవీకాలం పూర్తయ్యే వరకూ అందులోనే కార్యకలాపాలు నిర్వహించారు. ఆ భవనం కూల్చివేసి తహసీల్దార్ ఆఫీస్‌ను జెడ్పీ భవనంలోకి మార్చారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ప్రైవేట్ ఫంక్షన్‌హాళ్లు, ఎన్టీపీసీలోని మిలీనియం హాల్ దిక్కయ్యాయి. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఎంపీడీవో కార్యాలయ స్థలంలో జెడ్పీ భవనం నిర్మించాలని అప్పట్లో యోచించినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయ భవన స్థలాన్ని ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించిన విషయం పాఠకులకు తెలిసిందే.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలోకి..
ప్రస్తుతం జెడ్పీ సీఈవోతోపాటు అధికారులు, సిబ్బంది సమీప రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. అరకొర సౌకర్యాల మధ్య అవస్థల పాలవుతున్నారు. జెడ్పీ పాలక మండలి గడువు ముగియడంతో అధికారు లు, సిబ్బంది ఎలాగోలా విధులు కానిచ్చేస్తున్నారు.
స్పెషలాఫీసర్‌గా కలెక్టర్..
జెడ్పీ చైర్మన్, సభ్యుల పదవీకాలం 2024 జూలై 4న ముగిసింది. జెడ్పీ సీఈవోతోపాటు ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పాలన సాగిస్తున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకు వచ్చి వెళ్లి పోయారే తప్ప ఇప్పటివరకు ఆఫీసులో అడుగుపెట్టిన దాఖలాలు లేవు.
రూ.1.60 కోట్లతో పనులు
తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోని స్థలంలోనే జెడ్పీ కార్యాలయం (ఇదే భవనంలో ఎంపీడీవో ఆఫీసు కూడా) నిర్మించేందుకు రూ.కోటి 60లక్షలతో ఏడు నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఏడాదిలో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇప్పటికీ పునాదుల స్థాయిలోనే పనులు ఉన్నాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.40లక్షల బిల్లులు చెల్లించేందుకు చెక్కులు జారీ చేసినా.. ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. దీంతో పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఎంపీడీవో ఆఫీసుదీ ఓ దీనగాథ
బస్టాండ్‌ను ఆనుకుని ఐదుదశాబ్దాల పాటు సేవలు అందించిన ఎంపీడీవో కార్యాలయ భవనం కూల్చి ఆ స్థలాన్ని ఆర్టీసీ బస్సుడిపో ఏర్పాటుకు కేటాయించారు. దీంతో ఎంపీడీవో ఆఫీసు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్నినెలల పాటుస్టేషన్ రోడ్డులోని ఓ ఇరుకై న అద్దెభవనంలో మండల పరిషత్ పాలన సాగింది. అద్దెభవనాలను ఖాళీ చేయాలని సర్కారు ఆదేశాలివ్వడంతో మళ్లీ అద్దెభవనంలో నుంచి ప్రభుత్వ ఐటీఐ భవనంలోని మార్చారు. ఇరుకైన రెండు గదుల్లోనే ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
కొత్త పాలకులు వస్తే ఇంకా ఇబ్బందే
పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే కొత్తపాలక మండళ్లు ఎక్కడ సమావేశాలు నిర్వహిస్తారు? విధులు ఎలా నిర్వర్తిస్తారో అంతుబట్టడం లేదు. అందుకే జెడ్పీ సొంత భవనం నిర్మించే పనుల్లో వేగం పెంచేలా ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ముందుకు సాగని నిర్మాణ పనులు
కొత్త పాలక మండలికి నీడ కరువు
మండల పరిషత్ ఆఫీస్‌దీ అదేపరిస్థితి


