గోదావరిఖనిటౌన్: లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం సాధ్యమని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. స్థానిక న్యాయ స్థానం ఆవరణలో పోలీస్ సబ్ డివిజన్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో జడ్జి మాట్లాడారు. ఈనెల 28న చేపట్టే లోక్ అదాలత్‌లో కక్షిదారులు అధికంగా పాల్గొని కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. క్షణికావేశంలో కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథాచేసుకోకుండా రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటసచిన్ రెడ్డి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్, ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
జూలపల్లి: తెలుకుంట రైతువేదికలో మంగళవారం రైతునేస్తం నిర్వహించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌పై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఎరువుల యాప్, డ్రోన్ వినియోగంపై అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం భూసార పరీక్షల పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రత్యూష, సర్పంచ్ సంపత్‌కుమార్, ఉపసర్పంచ్ దావు సంపత్‌రెడ్డి, ఏఈవో కిరణ్మయి, శ్యామల, రైతులు పాల్గొన్నారు.
దళారులను నమ్మొద్దు
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు ప్రచారం చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ సూచించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు కలెక్టర్ నేతృత్వంలో వారధి సొసైటీ ద్వారా ని ర్వహిస్తారన్నారు. నిరుద్యోగులు ఈ విషయా న్ని గమనించాలని కోరారు. ఉద్యోగం కావాలనుకునే వారు నేరుగా కలెక్టర్ కార్యాలయంలోని వారధి సొసైటీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
పత్తి మార్కెట్‌కు సెలవులు
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఉగాది పండుగ సందర్భంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు కొనుగోళ్లు ఉండవని మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 19 ఉగాది (గురువారం) నుంచి ఆదివారం (ఈనెల 22 వరకు) పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. తిరిగి ఈనెల 23వ తేదీ సోమవారం నుంచి కొనుగోళ్లు సాగుతాయని, రైతులు గమనించాలని మల్లారెడ్డి కోరారు.
ఆస్పత్రి భవనం పరిశీలన
ధర్మారం: నందిమేడారంలో చేపట్టిన కొత్త భ వనం పనులను జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. ఆ స్పత్రికి అందించిన వైద్య పరికరాలను తనిఖీ చేశారు. త్వరలోనే వైద్య సేవలు ప్రారంభిస్తా మని శ్రీధర్ తెలిపారు. అధికారులు ఉన్నారు.
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ పదవులకు పోటీచేసిన వారు తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఈనెల 23వ తేదీలోగా అందించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి లోని 36 వార్డులకు 157మంది పోటీచేయగా.. అందులో 64 మంది మాత్రమే ఖర్చు వివరాలను అందించారని ఆయన పేర్కొన్నారు. మిగతావారు ఈనెల 23వ తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలోని రూం నంబరు 204లో జూనియర్ అసిస్టెంట్ మహేశ్(సెల్ నంబరు 99590 98981)లో అందించాలన్నారు. సకాలంలో ఖర్చు వివరాలు అందించని అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు.


