రామగుండం: పెద్దంపేట రైల్వే ప్లాట్‌ఫారంపై సోమవారం మహారాష్ట్రకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. జీఆర్పీ ఇన్‌చార్జి తిరుపతి తెలిపిన వివరాలు.. పెద్దంపేట రైల్వే ప్లాట్‌ఫారం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ పురుషుడి మృతదేహం ఉన్నట్లు తమకు గుర్తుతెలియని వ్యక్తులు సమాచారం అందించారు. మృతుడి తలకు తీవ్రగాయాలవడంతోనే మృతిచెందినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోగా, కుడి చేతిపై తన గ్రామ సర్పంచ్ సెల్ నంబర్ రాసి ఉండడంతో సదరు నంబర్‌కు కాల్ చేయడంతో మృతుడి వివరాలను గుర్తించగలిగామన్నారు. మృతుడు గడ్ఛందూర్‌రోడ్, పండరీపుర, చంద్రాపూర్ జిల్లా, మహారాష్ట్రకు చెందిన సందీప్ గజానన్ మహదేవ్(32)గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కెనాల్‌లో దొరికిన ఉద్యోగి మృతదేహం
కొత్తపల్లి (కరీంనగర్): కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ప్రమాదవశాత్తు చింతకుంట కాకతీయ కెనాల్‌లో పడి గల్లంతుకాగా... ఆయన మృతదేహం సోమవారం దొరికింది. చింతకుంటకు చెందిన రాచకొండ లచ్చయ్య (52) ఆదివారం కెనాల్‌లో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు.
అవినీతి కేసులో అరెస్టు
కరీంనగర్‌క్రైం: కాంట్రాక్టుర్లు, పలువురు ఉద్యోగుల వద్ద బీనామీ అకౌంట్ ద్వారా లంచం తీసుకున్న కేసులో తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. మధుసూధన్ కొందరు కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు చెందిన బిల్లులు చెల్లించేందుకు భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకులో ఒక బీనామీ అకౌంట్ ద్వారా 15 సెప్టెంబర్, 2022 నుంచి 20 సెప్టెంబర్ 2023 వరకు యూపీఐ అకౌంట్ల ద్వారా రూ.14,77,003 లంచం తీసుకున్నాడు. ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
గన్నేరువరం: మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద సోమవారం వేకువజూమున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. గుండ్లపల్లికి చెందిన కొమ్ము రాజ్‌కుమార్, మండే శ్రీకాంత్ ద్విచక్రవాహనంపై గుండ్లపల్లి స్టేజీ వద్ద గల రహదారిని క్రాస్ చేస్తుండగా, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టాటా పంచ్ కారు ఢీకొట్టింది. ద్విచక్రవాహనదారులకు తీవ్రగాయాలు కాగా కరీంనగర్ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొమ్ము రాజ్‌కుమార్(26) మృతి చెందాడు. శ్రీకాంత్ చికిత్స పొందుతున్నాడు. కాగా మృతుడి సోదరుడు వేల్పుల తిరుపతి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ మల్లోజుల అన్వేశ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు.


