రామగుండం: రైతులకు దళా రుల నుంచి విముక్తి కల్పించేందుకు సమూహంగా ఏర్పడి పంటలు సాగుచేయడం, గిట్టుబా టు ధరకు విక్రయించడం, పంటల మార్కెటింగ్, ఎగుమతులు వంటి పనులతో నేరుగా రైతులకే లబ్ధి చేకూరేందుకు కేంద్ర ప్రభుత్వం కంపెనీల చట్టం–2013 ప్రకారం రైతు ఉత్పత్తిదారుల సంస్థగా చట్టబద్ధత కల్పించింది. దీనిని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంస్థగా ప్రకటించింది. ప్రతీ రైతు ఎఫ్‌పీవోలో సభ్యత్వం పొందితే సాగులో భరోసా కలుగుతుంది. ఈ సందర్భంగా ఎఫ్‌పీవోపై రామగుండం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ప్రత్యేకాధికారి, సహాయక రిజిస్ట్రార్ బొనగాని నరేశ్ పలు అంశాలను వెల్లడించారు.
ఎఫ్‌పీవో ముఖ్య ఉద్దేశం
చిన్న రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, రైతుల ద్వారా, రైతుల కోసం, రైతుల సంస్థగా రూపుదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. ఉత్పత్తులను సమూహంగా విక్రయించడంపై అన్నదాతలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుంది. ఫలితంగా రైతుల ఆదాయం రెండింతలు కావడానికి ఇదో మార్గం.
ఇన్‌పుట్స్ ఖర్చు తగ్గించడం
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, యంత్రాలు తదితర వస్తువులను సమూహంగా కొనుగోలు చేయడంతో వ్యయభారం తగ్గుతుంది. ఫలితంగా ఉత్పాదకత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో సుస్థిర వనరుల వినియోగంతో దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది.
మార్కెట్ లింకేజీల మెరుగు
బల్క్ ఉత్పత్తులు సాధించడం, స్టోరేజీ, ప్రాసెసింగ్, ఎగుమతులు, నేరుగా వినియోగదారుడికి విక్రయించడం జరుగుతుంది. ఫలితంగా దళారుల బెడద తగ్గి లాభదాయకంగా ఉంటుంది. సామూహిక సాగు విధానంతో రైతులలో మెలకువలు పరస్పరం పంచుకునే వీలుంటుంది. తద్వారా నేర్పుతో సాగు విధానాలు అవలంబించడం పట్ల నాణ్యమైన దిగుబడిని పొందే వీలుంటుంది.
ఎఫ్‌పీవోలో చేరడం
రైతులు రూ.రెండు వేలు చెల్లించి ఎఫ్‌పీవోలో చేరవచ్చు. దీనికి ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇరవై షేర్లు రూ.రెండు వేలు చెల్లించడంతో మొత్తంగా రైతు పేరు మీద 40 షేర్లు వస్తాయి. ఈ షేర్లపై రైతులు లాభాలు, డివిడెండ్లు పొందుతారు. ఫలితంగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ఎఫ్‌పీవో సభ్యులు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హులు. ఈ విధానం వ్యవసాయ ఉత్పత్తి, మార్కెట్‌కు సహాయపడుతుంది.
అవసరమైన పత్రాలు
రైతు సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఫోన్‌నంబర్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఉమ్మడి రామగుండం మండల పరిధిలో రైతులు ఎఫ్‌పీవోలో చేరేందుకు 94947 83280, 98499 26919, 79818 69290 నంబర్లలో సంప్రదించాలని సహాయక రిజిస్ట్రార్ కోరారు.
సొసైటీ సహాయక రిజిస్ట్రార్ బొనగాని నరేశ్


