అమ్మ ఆలోచన.. దాతల ఆచరణ | - | Sakshi
Sakshi News home page

అమ్మ ఆలోచన.. దాతల ఆచరణ

Mar 17 2026 7:25 AM | Updated on Mar 17 2026 7:25 AM

అమ్మ ఆలోచన.. దాతల ఆచరణ ● కోర్టు కాంప్లెక్సు ఆవరణలో అన్నదానం ● ఈ ఏడాది ఆరంభం నుంచి అమలు ● శ్రీకారం చుట్టిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

పెద్దపల్లిరూరల్‌: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్ని దానాల్లోకెల్ల అన్నదానం మిన్న.. ఆకలి వేసినప్పుడు గుప్పెడన్నం కడుపులో పడితే చాలు అనుకునే వారికి సకాలంలో అన్నం అందితే.. మీరు చల్లగా ఉండాలి.. అన్నదాత సుఖీభవ.. అంటూ ఆశీర్వదిస్తారు.. ఈనేపథ్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో కేసుల నిమిత్తం పలు రకాల కోర్టులకు హాజరయ్యే కక్షిదారుల ఆహార్తిని తీర్చాలనే ఆలోచనకు వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఈ ఏడాది జనవరి నుంచి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం కక్షిదారులకు అన్నదానం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దాతల సహకారంతో..

తమ పెళ్లిరోజు.. పిల్లల పుట్టినరోజున అన్నదానం చేయాలని ఉన్నా.. భోజనాలను సిద్ధం చేయించడం, వాటిని పేదలు, ఆకలితో ఉన్నవారికి అందించడం ఎలా.. అన్న ఒకే కారణంతో చాలామంది దూరంగా ఉంటున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గమనించారు. అలాంటివారికి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. కోర్టు ఆవరణలోని క్యాంటీన్‌ వారికి డబ్బు కడితే భోజనం సిద్ధం చేస్తారు. అయితే ప్రతి సోమవారం ఎక్కువ మంది వస్తారనే ఆలోచనతో ఆరోజే అన్నదానం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.

దూరప్రాంత వాసులకు మేలు

దూర ప్రాంతాలకు చెందిన వారు తమపై ఉన్న కేసుల నిమిత్తం పెద్దపల్లిలోని పలు రకాల కోర్టులకు హాజరవుతుంటారు. అలాంటి వారు తమ ఇళ్ల నుంచి ఉదయమే బయల్దేరి వచ్చి కోర్టులో తమ కేసు బెంచీపైకి ఎప్పుడు వస్తుందో తెలియక పొద్దంతా అక్కడే నిరీక్షించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఉండీ లేక.. ఆకలి తీర్చుకోలేక ఇబ్బందులు పడే పేదలకు కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి ఏర్పాటు చేయించిన ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో ఊరటనిస్తోందనడంలో సందేహం లేదు. సామాజిక సేవ చేయాలనే తపన, స్పృహ ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆలోచనలను అభినందిస్తూ అన్నదాత.. సుఖీభవ.. అంటూ కీర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement