పెద్దపల్లి: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ సూచించారు. జనగణన– 2027 కార్యక్రమ నిర్వహణలో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. జనగణన ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతీ అధికారిపై ఉందన్నారు. శిక్షణలో భాగంగా డేటా సేకరణ విధానం, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జనగణన కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు అవసరమైన కచ్చితమైన గణాంకాలు సిద్ధమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి సత్వరం పరిష్కరించాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పాలనాధికారి బి.ప్రకాష్‌తో కలిసి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన గెల్లు కేతమ్మ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో పీడీకి తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులకు ఎన్టీపీసీ ప్రోత్సాహం
జ్యోతినగర్(రామగుండం): క్రీడలతో మంచి ఆరోగ్యం లభిస్తుందని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ముకుల్‌రాయ్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్ జిల్లా ప్రజా పరిషత్ క్రీడా మైదానంలో ఎన్టీపీసీ సీఎస్సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీ క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎన్టీపీసీ ప్రోత్సహిస్తుందన్నారు. రామగుండం, అంతర్‌గాం, కమాన్‌పూర్, పాలకుర్తి మండలాల్లోని 21 ప్రభుత్వ పాఠశాలల క్రీడాకారులకు వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, అధికారులు ప్రవీణ్ కే చౌదరి తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్లు విడుదల చేయాలి
పెద్దపల్లి: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నిరుద్యోగులకు ఏడాదికో సారి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న మాదిరిగా నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సుల్తానాబాద్ పట్టణంలో స్థానిక నాయకులతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన త ర్వాత నోటిఫికేషన్ల మాట ఎత్తడం లేదని ఆరో పించారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌యాదవ్, ప్రదీప్‌కుమార్, నిర్మల, రాజేంద్రప్రసాద్, ప్రవీణ్‌కుమార్, నల్ల మనోహర్‌రెడ్డి, రమేశ్, మునీందర్, నాగేశ్వర్, సంతోష్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, శశివర్ధన్, భాగ్యలక్ష్మి, అన్వేశ్, లత, దాసరి చందు, శ్రీనివాస్, ఐలవేణి శ్రీనివాస్, వెంకటేశ్, శంకర్, కిరణ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


