పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు.. రామగుండం కార్పొరేషన్‌లో కో– ఆప్షన్ పదవుల కోలాహలం మొదలైంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్‌లో కో ఆప్షన్ ఎన్నికల నిర్వహణకు మున్సిపల్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయి, కొత్తగా ఎన్నికై న పాలకవర్గం గతనెల 16న కొలువుదీరాయి. మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపాలకులు ప్రమాణస్వీకారం చేసిన రెండు నెలల్లోగా (ఏప్రిల్ 16లోగా) కో ఆప్షన్ ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. దీంతో కోఆప్షన్ పదవులపై కన్నేసిన ఆశావహులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు.
అధికార కాంగ్రెస్‌కే అన్నీ..
మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో కోఆప్షన్ పదవులన్నీ అధికార కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మున్సిపల్ చట్టం ప్రకారం నిర్వహించే ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో నాలుగు, రామగుండం కార్పొరేషన్‌లో డివిజన్లు ఎన్ని ఉన్నా ఐదు స్థానాలకే పరిమితం చేశారు. కార్పొరేషన్‌లోని ఐదు స్థానాల్లో మూడు జనరల్ కేటగిరీ, రెండు పదవులు మైనార్టీలకు.. మున్సిపాలిటీలోని నాలుగు కోఆప్షన్ పదవుల్లో రెండు జనరల్, రెండు మైనార్టీలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
పెరిగిన పోటీ
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్నా.. పార్టీ టికెట్ రాక నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో వారిని బుజ్జగించి కో ఆప్షన్‌గా అవకాశం కల్పిస్తామంటూ కొందరికీ హామీ ఇవ్వగా..ఆశతో ఉన్న ఇంకొందరు రాజకీయ ఒత్తిళ్లను పెంచి కో ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ పదవులకు పోటీ పెరిగింది. అందుకోసం తమకు అనువుగా మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం యత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం కొందరికి ముందే మాట ఇచ్చినట్టుగా పలువురు చెప్పుకుంటున్నారు. అయితే నాలుగు కోఆప్షన్ పదవులే ఉండడంతో అంతకు మించి ఆశావహులు ఉండడం కొంత ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది.
ఎన్నిక విధానం
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహణకు కమిషనర్ ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో మైనార్టీ కోటాలో పోటీ చేసేవారు కుల ధ్రువీకరణ పత్రం జతపర్చాల్సి ఉంటుంది. పదవుల సంఖ్యను మించి అభ్యర్థులు పోటీలో ఉంటే కౌన్సిల్ సభ్యులు వారిని ఎన్నుకుంటారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లతో సమానంగా సమావేశాల్లో పాల్గొని చర్చించవచ్చు. కానీ తీర్మానాలు, ఎన్నిక సమయంలో ఓటు వేసే హక్కు ఉండదు. గౌరవ వేతనం, ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి. వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతారు.


