పాత పాలకవర్గాలకు చెల్లు
కేడీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జీగా కలెక్టర్ కేడీసీసీబీ, ప్యాక్స్ పాలకవర్గాలు రద్దు ఇక అధికారుల కనుసన్నల్లో నిర్వహణ
కరీంనగర్ అర్బన్: ప్రాథమిక సహకార సంఘాల పరిపాలన అధికారుల హస్తగతమైంది. పాత పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కేడీసీసీబీతో పాటు ఉమ్మడి జిల్లాలో కేడీసీసీబీ పరిధిలో గల 131 ప్యాక్స్ పాలకవర్గాలు రద్దయ్యాయి. కేడీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జీగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని నియమించారు. ఎన్నికలు జరిగే వరకు ఇదే విధానం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీంతో పర్సన్ ఇన్‌చార్జీగా ఐఏఎస్‌ను నియమించారన్న వాదన వినిపిస్తోంది.
4 నెలల క్రితం పొడగింపు.. అంతలోనే రద్దు
సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా.. మళ్లీ పాలకవర్గాల గడువు పొడిగిస్తారా అన్న మీమాంస క్రమంలో నాలుగు నెలల క్రితం ఆగస్టు 14న పాలకవర్గాల గడువు పొడిగించింది. ఎన్నికలుంటాయా.. నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తారా అన్న ఊహగానాలకు తెరదించుతూ గడువు పొడిగించింది. నాలుగు నెలల వ్యవఽధిలోనే పాలకవర్గాలను రద్దు చేయడం చర్చనీయాంశఽమైంది. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా వాస్తవానికి 2025 ఫిబ్రవరితో గడువు ముగిసింది. సదరు సమయంలో 6 నెలల గడువు పెంచగా ఆగస్టు 14తో ముగియగా మళ్లీ పెంచిన విషయం తెలిసిందే.
స్థానిక ఎన్నికల తరువాతే
స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో ఇటీవలే సర్పంచి ఎన్నికలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. 42శాతం బీసీ రిజర్వేషన్ తెరపైకి రావడం, హైకోర్టు పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించడం తెలిసిందే. సర్పంచ్ ఎన్నికలు పూర్తవగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో పర్సన్ ఇన్‌ఛార్జీని నియమించారని సమాచారం. సదరు ప్రక్రియ ఆలస్యమవుతుండగా సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో ఉండే అవకాశఽం లేదు. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తదుపరి సర్పంచి, మునిసిపాలిటీ ఎన్నికలు జరగాల్సి ఉండగా తొలుత సర్పంచి ఎన్నికలను నిర్వహించారు. మిగతా ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 3–4నెలలు పట్టనుంది. అన్ని ఎన్నికలు వరుసగా వస్తాయన్న ప్రచారం నడుస్తోంది. స్థానిక సంస్థల పోరు అనంతరం సొసైటీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నామినేట్ చేసే అవకాశం
ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో వ్యవహారం కావడంతో నామినేట్ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేడీసీసీబీ పరిధి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉండగా కరీంనగర్,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో సహకార సంఘాలున్నాయి. నామినేటేడ్ చేసే అవకాశాలే ఎక్కువని ఉన్నతాధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. సదరు విధానంతో పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తికి పదవి కట్టబెట్టినట్లవుతుందన్న వాదన వినిపిస్తోంది.


