జీజీహెచ్‌లో యువకుడి హల్‌చల్
● ఓపీ కౌంటర్ అద్దాలు ధ్వంసం ● అదుపులోకి తీసుకున్న పోలీసులు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో శుక్రవారం ఓ యువకుడు వైద్య సిబ్బందిపై ఆగ్రహంతో హల్‌చల్ సృష్టించాడు. ఫర్నీచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. వైద్యాధికారులు, సిబ్బంది కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఓ యువకుడు ఈనెల 11న వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు గ్యాస్ట్రో సమస్యగా గుర్తించి ఆరోగ్యశ్రీ కింద ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ చేసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఈనెల 17న డిచ్చార్చి చేస్తున్నట్లు చెప్పి ఆరోగ్యశ్రీలో వివరాలు అప్‌డేట్ చేయడానికి ఆన్‌లైన్‌లో సమస్య ఉందని, ఫోన్‌చేసి సమాచారం ఇచ్చినప్పుడు ఓటీపీ చెప్పాలని పేషెంట్‌ను ఇంటికి పంపించారు. శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన ఆ యువకుడు.. తనకు మెరుగైన వైద్యం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీ సిబ్బందిని బెదిరిస్తూ ఓపీ అద్దాలను పగులగొట్టాడు. దాడిలో కంప్యూటర్, కీబోర్డు, స్కానర్ ధ్వంసమయ్యాయి. ఒక సిబ్బంది కాలుకు గ్లాసు తగిలి స్వల్ప గాయమయ్యింది. యువకుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే యువకుడుని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిసింది. ఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంవోలు కృపాబాయి, రాజును వివరణ కోరగా.. దాడికి పాల్పడిన వ్యక్తిపై వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. దాడులకు పాల్పడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.


