భర్త మృతి.. భార్య గెలుపు
ముత్తారం(మంథని): పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబరుగా పోటీ చేసి గెలువాలని భార్యను బరిలో నిలిపాడు. భార్యాభర్తలు కలిసి తమను గెలిపించాలని ప్రచారం చేశారు. అంతలోనే ఏమైందో కాని భర్త పురుగులమందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేటకు చెందిన పోలుదాసరి శ్రీనివాస్(38) ఈనెల 9న పురుగులమందు తాగగా, చికిత్స నిమిత్తం పెద్దపల్లి, కరీంనగర్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య శ్రీలత నాల్గో వార్డులో పోటీ చేసి గెలుపొందింది. భర్త రెండురోజులుగా చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడిన, పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబరుగా ఓటర్లు పట్టం కట్టారు. శ్రీనివాస్ మృతికి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఎన్నికల్లో గెలుపొంది సంబరంలో ఉండాల్సిన కుటుంబంలో శ్రీనివాస్ మృతి విషాదం నింపింది. ఈ ఘటనపై ఎస్సై రవికుమార్‌ను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు.


