1600 మందితో బందోబస్త్
గోదావరిఖని: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు 1,600 మంది పోలీస్‌లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తొలివిడతలోని కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగిరి, మంథని, ముత్తారం మండలాల్లో గల 685 పోలింగ్ కేంద్రాల్లో 135 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేశారు. కమిషనరేట్‌లోని 1,712 పోలింగ్ కేంద్రాల్లో 538 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. గోదావరి వంతెన, ఎక్లాస్‌పూర్, దుబ్బపల్లి, గుంపు ల చెక్‌పోస్ట్‌ల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు.
ఇద్దరు డీసీపీలు.. ఆరుగురు ఏసీపీలు
తొలివిడత ఎన్నికల్లో బందోబస్తు పర్యవేక్షణకు ఇద్దరు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 95 మంది ఎస్సైలను నియమించారు. 270 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 520 మంది కానిస్టేబుళ్లు, 240 మంది హోంగార్డులు, 170 మంది ఆర్మ్‌డ్ సిబ్బంది, క్యూఆర్ టీంలు 72 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
శాంతియుత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా


