‘సిమ్స్’కు మరో 12 పీజీ సీట్లు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో పీజీ మెడికల్ కాలేజీగా గుర్తింపు పొందిన సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ)లో మరికొన్ని పీజీ కోర్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నాలుగు విభాగాల్లో 16 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) మంజూరు చేసింది. తాజాగా మరోమూడు వి భాగాల్లో 12 సీట్లు కేటాయించాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ)కు సిమ్స్ యాజమా న్యం ఇటీవల దరఖాస్తు చేసింది.
రెండు నెలల క్రితం 16 పీజీ సీట్లు..
సిమ్స్‌కు నాలుగు విభాగాల్లో 16 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్‌ఎంసీ ఉత్వర్వులను జారీ చేసింది. ఇందులో ఎండీ(ఎమర్జెన్సీ మెడిసిన్), ఎంఎస్(ప్రసూతీ, గైనకాలజీ), ఎంఎస్(ఆర్థోపెడిక్స్), ఎండీ(బయో కెమెస్ట్రీ)లో నాలుగు చొప్పున పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ సీట్ల భర్తీకి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
మూడు విభాగాల్లో సీట్ల కోసం..
మరోమూడు విభాగాల్లో 12 పీజీ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ యాజమాన్యం ఇటీవల డీఎంఈకి దరఖాస్తు చేసింది. మెడిసిన్, సర్జరీ, పీడియా ట్రిక్స్ విభాగాల్లో నాలుగు చొప్పున మొత్తం 12 పీజీ సీట్లు మంజూరు చేయాలని విన్నవించింది.
త్వరలో ఎన్‌ఎంసీ బృందం తనిఖీ
మెడికల్ కాలేజీ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో నివేదికను డీఎంఈ ఉన్నతాధికారులు ఎన్‌ఎంసీ పరిశీలనకు పంపించనున్నారు. అయితే, కోర్సుల విభాగాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రొఫెసర్ల సంఖ్య, క్లినికల్ మెటీరియల్ తదితర వివరాలను పరిశీలించడానికి ఎన్‌ఎంసీ అధికారులు త్వరలోనే మెడికల్ కాలేజీని తనిఖీ చేయనున్నారు. వారు సంతృప్తి చెందేలా కాలేజీలో అవసరమైన సదుపాయాల కల్పనకు యాజమాన్యం ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
తాజాగా దరఖాస్తు చేసిన మెడికల్ కాలేజీ యాజమాన్యం
ఇప్పటికే 16 పీజీ సీట్లు మంజూరు చేసిన ఎన్‌ఎంసీ


