పకడ్బందీగా ఎన్నికలు
● అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకోసం అధికారులకు శిక్షణ ఇచ్చామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అర్హులందరూ ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 263 పంచాయతీలు, 2,432 వార్డులు ఉన్నాయని, అన్నింటా వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తామని, తొలివిడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించే 78 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. తొలిదశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశామని, ఈనెల 11న మంథని, ముత్తారం, కమాన్‌పూర్, రామగిరి, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని 99 పంచాయతీలు, 896 వార్డులకు పోలింగ్ జరుగుతుందన్నారు. కలెక్టర్‌తో జరిపిన ఇంటర్వ్యూ వివరాలు..
జిల్లాలో ఎన్ని విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు?
కలెక్టర్ : జిల్లాలో మూడువిడతల్లో పోలింగ్ నిర్వహిస్తాం. తొలివిడత ఈనెల 11న నిర్వహిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశాం. బ్యాలెట్ బాక్స్‌లు పరిశీలించాం.
ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
కలెక్టర్ : సర్పంచ్ ఎన్నికలు పూర్తికాగానే అదేరోజు మెజారిటీ వార్డు సభ్యుల అభిప్రాయం మేరకు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది.
ఓటరు జాబితాలో మృతుల పేర్లు ఉన్నాయి?
కలెక్టర్ : జూన్ రెండోతేదీ వరకు మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఈఆర్‌వో, ఆర్డీవో, తహసీల్దార్ అఖిలపక్ష సమావేశంలో పొరపాట్లు సరిచేశారు.
సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ ఎలా?
కలెక్టర్ : పోలీస్ పహారాలో పోలింగ్ నిర్వహిస్తాం. ఇందుకోసం అనుసరించే విధానాలపై పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్షించాం.
రెండు, మూడో విడత ఎన్నికలు?
కలెక్టర్ : రెండోవిడతలో అంతర్గాం, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి మండలాల్లోని 73 పంచాయతీలు, 684 వార్డులు, మూడోవిడతలో ఎలిగేడు, ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లోని 91 పంచాయతీల్లో 852 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తాం.
పకడ్బందీగా ఎన్నికలు


