చిరునవ్వుతో సమాధానమిస్తాం
గోదావరిఖని(రామగుండం): ప్రేమించే వారిని ప్రేమిస్తూ.. ద్వేషించే వారికి చిరునవ్వుతో సమాధానం చెప్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి స్థానిక ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విపక్షాలు విమర్శించే కొద్ది అభివృద్ధి పెంచుకుంటూ పోతామన్నారు. అంతర్గాంలో 977ఎకరాల్లో ఎయిర్‌పోర్టు రాబోతుందని పేర్కొన్నారు. గోదావరితీరంలో సమ్మక్క– సారలక్క, రాముని గుండాలపై ఆంజనేయస్వామి విగ్రహం, మున్సిపల్ ఆఫీస్ ముందు టీజంక్షన్ వద్ద భారీ గణపతి విగ్రహంతో పలు ప్రాంతాల్లో అందమైన ఆలయాలు ఏర్పాటు చేసి టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఇప్పటివరకు రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి చేశామన్నారు. 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డు స్టోరేజ్ ప్లాంట్లకు రాష్ట్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి రైతులకు 3 పంటలకు సాగునీటితో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ కట్టించిన మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు పంటల సాగుకు పనికిరాకుండా పోయాయన్నారు. పాలకుర్తిలో రూ.450 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో చేపడతామని పేర్కొన్నారు. అభివృద్ధిని ఓర్వలేక బీఆర్‌ఎస్ శ్రేణులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. నాయకులు మహంకాళిస్వామి, బొంతల రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి, ముస్తాఫా, తిప్పారపు శ్రీనివాస్, సింగరేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్


