ఎన్నికల వేళ.. పెరిగిన చికెన్ ధర
పెద్దపల్లి: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరు అందుకుంది. గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బరిలో ఉన్న అభ్యర్థులు విందు వినోదాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈనేపథ్యంలో మటన్ కిలో రూ.800 నుంచి 1,000 ధర పలుకుతుండడంతో చికెన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి.
స్కిన్‌లెస్ కిలో రూ.240
తండాలు మొదలుకొని గ్రామపంచాయతీల్లో ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదు చికెన్ సెంటర్లు ఉన్నాయి. వేకువజాము మొదలుకొని రాత్రి 11 గంటల వరకు చికెన్ ఎప్పుడు కావాలన్నా దొరకుతుంది. దీంతో విందులో చికెన్ పకోడి మొదలుకొని పలు రకాల చికెన్ వంటకాలు వండి పెడుతున్నారు. కిలో కోడి రూ.160, కిలో చికెన్ రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ.220 ధర పలుకుతున్నట్లు అభ్యర్థులు చెప్తున్నారు. కిలో చికెన్ దాబాలు, హోటళ్లలో వండినందుకు రూ.100 చొప్పున తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈనెల 14న మొదటి విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇంటింటా కిలో చొప్పున చికెన్ పంపిణీ చేసేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చికెన్ సెంటర్ల నిర్వాహకులకు అడ్వాన్సు రూపకంగా కొంత డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. సాధారణ సమయంలో రోజూ 20 కిలోల చికెన్ విక్రయించగా, ప్రస్తుతం 40 నుంచి 50 కిలోలు అమ్ముతున్నట్లు చికెన్ సెంటర్ల నిర్వాహాకులు చెబుతున్నారు.


