ఫలించని ఏకగ్రీవ ‘పంచాయతీ’
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కూనారం సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఆ కుర్చీ కోసం ఎనిమిది మంది ఆశావహులు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్‌గా ఒకరే పోటీలో ఉండేలా మిగతావారు పోటీనుంచి తప్పుకునేందుకు సమావేశం కావాలని నిర్ణయించారు. బుధవారం స్థానిక హనుమాన్ ఆలయ పరిసరాల్లో సమావేశం నిర్వహిస్తామని, గ్రామస్తులు అందరూ హాజరు కావాలని ఊళ్లో దండోరా వేయించారు. అనుకున్నట్లే అందరూ సమావేశమయ్యారు. సర్పంచ్ పదవి కోసం ఎనిమిది మంది పోటీపడుతున్నారని, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఒక్కరే పోటీలో ఉండి, మిగతా వారంతా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు కోరారు. ప్రచారం కోసం వృథాగా ఖర్చు చేయకుండా, ఎవరోఒకరే ఉంటే ఏకగ్రీవమవుతుందని ప్రతి పాదించారు. దీనిని అభ్యర్థులు తిరస్కరించారు. ఇన్నాళ్లూ బీసీ మహిళ, బీసీ జనరల్, జనరల్ స్థానాలకు ఏకగ్రీవం ప్రతిపాదన ఎందుకు చేయలేదని, ఎస్సీ జనరల్ స్థానానికి కేటాయించగానే ఏకగ్రీవం ప్రతిపాదన చేయడంలో ఆంతర్యం ఏమిటని కొందరు గ్రామస్తులు, అభ్యర్థులు ప్రస్తావించారు. ఎవరూ ఖర్చులపాలు కావొద్దని తామీప్రతిపాదన చేశామని గ్రామస్తులు అన్నారు. గడువులోగా ఒక్కరు తప్ప మిగతా అందరూ పోటీనుంచి తప్పుకోవాలని కోరారు. దీంతో ఎనిమిది మందిలో ఐదుగురు నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకున్నా రు. ముగ్గురు అభ్యర్థులు మాత్రం పోటీలోనే ఉన్నా రు. కవ్వంపెల్లి శ్రీకాంత్, గూల్ల తిరుపతి, బొట్కు రవీందర్, బందెల శంకర్, జూపాక ప్రవీణ్ పోటీ నుంచి తప్పుకున్నారు. జంజర్ల సుందర్‌రాజు, మంథెన రాజయ్య, మార తేజ పోటీపడుతున్నారు. గ్రా మస్తుల ఏకగ్రీవ ప్రతిపాదన ఫలించకపోవడంతో పోటీ అనివార్యమైందనే చర్చ సాగుతోంది.
కూనారం సర్పంచ్ బరిలో ముగ్గురు


