రిజర్వేషన్ కలిసి రాలేదా?
● ఉపసర్పంచ్‌కు పోటీచెయ్..
పెద్దపల్లి: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించని నాయకులు, ఆశావహులు తమ వ్యూహం మార్చుకున్నారు. సర్పంచ్‌గా పదవి దక్కించుకునేందుకు యత్నించి.. కనీసం వార్డుసభ్యుడిగానైనా ఎన్నికై ఆ తర్వాత ఉపసర్పంచ్ పదవి దక్కించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. కొందరు వార్డు సభ్యుడిగా ఎన్నికై నా పర్వాలేదంటున్నారు.
ఆర్థికంగా.. రాజకీయంగా అండ ఉంటేనే..
వార్డు, సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలన్నా.. అనుయాయులను గెలిపించుకోవాలన్నా డబ్బులే కీల కం మారుతున్నాయంటున్నారు. ఇందులోనూ గ్రా మం, సామాజికవర్గాల వారీగానూ హెచ్చుతగ్గులుంటాయి. పట్టణానికి, జిల్లా కేంద్రానికి, డివిజన్ కేంద్రానికి, మండల కేంద్రానికి, రహదారుల సమీపంలోని గ్రామాల్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తేనే సర్పంచ్, ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉందనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. మారుమూల ప్రాంతాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ పంచాయతీల్లో ఎంతలేదన్నా రూ.10 లక్షల వరకు వ్యయం చేయాల్సిందేనని పేర్కొంటున్నారు. ఆర్థికంగా లేనివారికి ప్రధాన పార్టీల నేతలు ఖర్చు భరించడంతోపాటు ఎలాగైనా గెలిపించుకునేలా యత్నిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
వార్డుల ఎంపికలో కీలకం..
ఉప సర్పంచ్‌పై కన్నేసినవారు తమ మద్దతుదారులను వార్డుస్థానాల్లో నిలుపుతున్నారు. ఇందుకోసం అభ్యర్థులను వారే ఎంపిక చేసుకుంటున్నారు. ఉప సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు వార్డుసభ్యుల మద్దతు ఉండాల్సిందే. దీంతోనే తమమాట వినే అనుచరులనే రంగంలోకి దించుతున్నారు. వారికి అవసరమైన నామినేషన్‌పత్రాలతోపాటు అన్ని పనులనూ దగ్గరుండి మరీ చక్కబెడుతున్నారు.
అధికార పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడు తన గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేద్దామని భావించి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. మారిన రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో కనీసం ఉప సర్పంచ్‌గానైనా విజయం సాధించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం వార్డు స్థానాలకు పోటీ చేసేవారితోపాటు తమ పార్టీ పెద్దలను ఒప్పించేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు.
రిజర్వేషన్ కలిసి రాలేదా?


