రాష్ట్రం వద్దన్నవారే రాజభోగాలు అనుభవిస్తున్నారు
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రం వద్దన్నవారే ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అధ్యక్షతన శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన దీక్ష దివస్‌లో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధుకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు ఏనాడూ తెలంగాణపై ఒక్కమాట మాట్లాడిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. యావత్ ప్రజల ఆకాంక్షే ధ్యేయంగా తెలంగాణను కదిలించిన కేసీఆర్.. సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం సాధించారని అన్నారు. అమరవీరుల త్యాగం, కేసీఆర్ పోరాటం, రేవంత్‌రెడ్డి ద్రోహాన్ని తెలంగాణ చరిత్ర లో ఎవరూ మర్చిపోరని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రఘువీర్ సింగ్, వంగల తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్, స్రవంతి, మోహన్ రావు, సంపత్, సందీప్‌రావు, మూల విజయారెడ్డి, కౌశికహరి, దాసరి ఉష, ముత్యాల బలరాంరెడ్డి, ఉప్పు రాజకుమార్, మార్కు లక్ష్మణ్, ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, కొయ్యడ సతీశ్‌గౌడ్, బోయిని రాజమల్లయ్య, సూర శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం


