సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
పెద్దపల్లి: ఎస్సీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విధులు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్సీ సంక్షేమశాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. మెనూ పాటించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ పని తీరుపై సమీక్షించారు. జిల్లాలో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి చర్యలు చేపట్టామని, ఎవరైనా వైద్యులు అందుబాటులో ఉంటే తనదృష్టికి తీసుకు రావాలని నేరుగా నియమించడం జరుగుతుందన్నారు.
15 రోజుల్లో ప్రారంభించాలి
మానసిక దివ్యాంగుల పాఠశాలను 15 రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్ పట్టణంలో మానసిక దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం పనులు, కేంద్రీయ డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన బోధన అందించాలి
పిల్లలకు మెరుగైన విద్యా బోధన అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో 22 పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అత్యుత్తమంగా పనిచేస్తున్న 22 స్కూళ్లను ఎంపిక చేసి అభినందిస్తున్నామన్నారు. అలాగే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్‌లో బాల్య వివాహాల నిరోధన పోస్టర్ ఆవిష్కరించారు.
పనుల్లో వేగం పెంచాలి
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అన్నారు. మంథని నియోజకవర్గంలోని ఇళ్ల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. 4 మండలాల పరిధిలో ఆశించిన స్థాయిలో ఇళ్ల పురోగతి లేదన్నారు. 45 రోజుల్లో పనులు ప్రారంభించికుంటే ఇల్లు రద్దు చేయాలని సూచించారు.
7న సామూహిక గీతాలాపన
వందేమాతర గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 7న ఉదయం 9.45 గంటలకు కలెక్టరేట్‌లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


