వివాదంగా మారిన కూల్చివేతలు
గోదావరిఖని(రామగుండం): దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారిమైసమ్మలను తొలగించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు కూల్చివేత కొనసాగింది. దీన్ని నిరసిస్తూ బీజేపీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపారు. చౌరస్తా సమీపంలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద దారిమైసమ్మకు పూజలు చేశారు. దారిమైసమ్మ విగ్రహాలు, ఆలయాలు కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆలయాలను కూల్చివేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక్‌హరి డిమాండ్ చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పూజలు నిర్వహించిన ఐక్యవేదిక నాయకులు
హిందూ వేదిక ఆధ్వర్యంలో కూల్చివేసిన దారిమైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు అయోద్య రవీందర్, సంతోష్‌రెడ్డి, రామ్మూర్తిగౌడ్, నాగులమల్యాల సత్యం, అంజన్న, అడిగొప్పుల రాజు, మునగాల సంపత్, కోమల మహేశ్, కొండపర్తి సంజీవ్‌కుమార్, ముసుకుల భాస్కర్‌రెడ్డి, సుల్వ లక్ష్మీనరసయ్య, ఐత పవన్, గుండబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీశ్, రాకేశ్, విశ్వాస్, మడికొండ శ్రీనివాస్, పిడుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, దారిమైసమ్మ ఆలయాల కూల్చివేతపై శుక్రవారం పోచమ్మమైదాన్‌లో హిందూ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ భేటీ కానుంది. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
చాలా ఫిర్యాదులు వచ్చాయి
రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకు సాగాలి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈనిర్ణయం తీసుకున్నాం. ఈమేరకు దారిమైసమ్మ గుడులు కొన్ని తొలగించాం. వీటిపై చాలా ఫిర్యాదులు రావవడంతో నెలరోజుల కిందట రోడ్డు సేఫ్టీ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ముందుకెళ్లాం.
– జె.అరుణశ్రీ,
మున్సిపల్ కమిషనర్, రామగుండం
దారిపొడవునా 46 మైసమ్మ ఆలయాల తొలగింపు
నిరసన తెలిపిన బీజేపీ నాయకులు


