నిందితులపై డేగకన్ను
పీడీయాక్ట్ కేసులు
గోదావరిఖని: రౌడీషీటర్లు పేట్రేగుతున్న నేపథ్యంలో రామగుండం కమిషరేట్ పోలీసుశాఖ అప్రమత్తమైంది. ప్రధానంగా పాతనేరస్తులపై డేగకన్ను వేసింది. ఇప్పటికే పీడీ యాక్ట్, రౌడీ, హిస్టరీ షీట్లను పోలీస్‌స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీస్ అధికారులు.. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ హత్య, హైదరాబాద్‌లో డీసీపై హత్యాయత్నం జరగడంతో కమిషనరేట్ పరిధిలో పాతనేరస్తుల కదలికలపై డేగకన్ను వేశారు.
పీడీయాక్ట్ కేసులు 152..
సమాజంలో ఉద్రిక్తతలు సృషిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని రామగుండం కమిషనరేట్‌లోని పోలీస్ అధికారులు నిర్ణయించారు. పాత నేరస్తులపై నిఘా పెంచారు. ఈ క్రమంలోనే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పీడీయాక్ట్‌లు 152కి చేరాయి. పీడీయాక్టు కేసుల నమోదులో హైదరాబాద్ తర్వాత రామగుండం కమిషనరేట్ అగ్రస్థానంలో నిలిచిందని పోలీసు అధికారులు తెలిపారు.
ఠాణాల వారీగా జాబితా..
పోలీస్‌స్టేషన్ల వారీగా నేరస్తుల జాబితా సేకరించిన పోలీస్ అధికారులు.. నేరస్తుల తోక ఊపితే పీక నొక్కుతామని స్పష్టం చేస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చినా.. భూ మాఫియా, రౌడీయిజం, గుట్కా దందా, కలప, రేషన్ బియ్యం అక్రమ రవాణా, దొంగలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాశాంతికి భంగం కలిగించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని, నేరస్తుల ఏరివేత ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
దొంగలపైనే పీడీ యాక్టులు
రామగుండం కమిషనరేట్‌లో పీడీయాక్టులు కేసులు ఇప్పటివరకు 152కు చేరాయి. పెద్దపల్లిలో 86, మంచిర్యాలజిల్లాలో 66 పీడీయాక్ట్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా దొంగలపైనే పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్నారు. రెండోస్థానంలో సమాజంలో భయాందోళ సృష్టించే రౌడీలపై అమలు చేస్తున్నారు. మూడు కేసులు నమోదైన వారిపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్నారు. వరుస దొంగతనాలు, రౌడీయిజం, హత్యలు, పేకాట గ్యాంగ్‌లు, కలపస్మగ్లర్లు, అక్రమ భూదందాలు నిర్వహించే వారిపై ఈ కేసులు పెడుతూ పాతనేరస్తులకు హెచ్చరికలు జారీచేస్తున్నారు.
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా..
రౌడీషీటర్లు, హిస్టరీ షీట్లపై పోలీసులు కన్నేసి ఉంచారు. ప్రతీరౌడీషీటర్ ఇంటికి బ్లూకోల్ట్స్ సిబ్బంది, పోలీసు అధికారులు వెళ్లి వివరాలను సేకరిస్తున్నా రు. రౌడీషీటర్లతో జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. నేరస్తులను ఠాణాకు తరలించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏడాది పెద్దపల్లి మంచిర్యాల మొత్తం
2017 01 0 01
2018 05 02 07
2019 16 11 27
2020 27 16 43
2021 30 33 63
2022 0 0 0
2023 07 02 09
2024 – 01 01
2025 0 01 01
మొత్తం 86 66 152
డీసీలు, కేడీలు, రౌడీలు, సస్పెక్ట్‌ల సమాచారం
డీసీలు 79
కేడీలు 40
రౌడీలు 484
సస్పెక్ట్‌లు 1,310
మొత్తం 1,913


