యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
సాక్షి,పెద్దపల్లి: పార్లమెంట్ పరిధిలోని యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి నూతన ప్రెస్‌క్లబ్‌ను ఆదివారం ఆయన సందర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకప్రాంతం అభివృద్ధికి రోడ్లు, రైల్వే, విమాన సర్వీసు సేవ లు విస్తృతం కావాలన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేస్తే సందర్శకుల రాక పెరుగుతుందని అన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరగవుతాయని, పె ట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశ ప్రతినిధిగా మాట్లాడే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ‘కాకా’ వెంకటస్వామి పింఛన్ హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని, జెనీవాలో ప్రసంగించారని గుర్తుచేశారు. 40ఏళ్ల తర్వాత తెలంగాణ నుంచి అదే వేదికపై తను మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దుబాయ్‌లోని ఇన్వెస్టర్లను ఇటీవల కలిసి పెద్దపల్లి – మంచిర్యాల మధ్య ప్రాంతాల్లో పెట్టుబడుల పెట్టాలని తాను విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ పదివేల మంది యువతకు ఉపాధి కల్పించేలా మెగా జాబ్‌మేళా నిర్వహించారని, పెద్దపల్లి పరిధిలో అలాంటి జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ సూచించారు. రామగుండం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు కోసం కృషి కొనసాగుతోందని తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ హెడ్‌ఆఫీస్‌ను రామగుండానికి మార్చడం ద్వా రా యూరియా సరఫరా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించగలమని ఆయన అన్నారు. రామగిరి ఖిల్లాను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.5కోట్లతో రోప్‌వే సహా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఎంపీని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానించారు.


