రైతుల ఆశలపై ‘నీళ్లు’
పెద్దపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వేకువజామున మోస్తరు వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వరిపైరు నేలవాలింది. పంటలు చేతికి అందుతున్న తరుణంలో కురుస్తున్న వర్షాలు అన్నదాత గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న కోతకు వస్తున్న తరుణంలో తు పాను దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కొనుగోళ్లకు ఆటంకం
పంటలు చేతికి వస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షం రైతులకు నష్టమే కలిగిస్తుందని అంటున్నారు. వివిధ తెగుళ్ల బారినపడ్డ పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇప్పటికే పురుగుమందులు చల్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి వర్షం తోడుకావడంతో ధాన్యం తడిసి ముక్కవాసన వస్తుందని, పత్తి రంగు మారుతుందని, మక్క మొలక వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మక్కలను సీసీఐ కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తుందని అంటున్నారు.


