
ఐదు నిమిషాలైతే ఇల్లు చేరేదే..
ధర్మపురి: ఐదు నిమిషాలైతే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకునేది. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గేదెను ఢీకొని మహిళాకూలి మృతి చెందిన సంఘటన మండలంలోని నేరెల్ల శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల పుష్పలత (50) రోజులాగానే పత్తి ఏరేందుకు కూలీకి వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకున్న అనంతరం భూమి యజమానితోపాటు పుష్పలత, గౌరమ్మను బైక్‌పై ఇంటికి బయల్దేరారు. నేరెళ్ల సమీపంలోకి రాగానే ఎదురుగా గేదె అడ్డు వచ్చింది. దానిని ఢీకొట్టడంతో పుష్పలత, గౌరమ్మ కింద పడిపోయారు. పుష్పలతకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గౌరమ్మకు స్వల్పగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధించారు. ఐదు నిమిషాల్లో ఇంటికి చేరేదానివంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పుష్పలతకు భర్త చంద్రయ్య, ముగ్గురు కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

ఐదు నిమిషాలైతే ఇల్లు చేరేదే..