 
															మెడి‘కిల్’ దందా!
ప్రిస్క్రిప్షన్ లేకున్నా యథేచ్ఛగా విక్రయాలు జనరిక్ మందులకు బ్రాండెడ్ ధరలు వసూలు నిఘా లేక.. పర్యవేక్షణ కొరవడి.. జిల్లాలో జోరుగా విక్రయాలు
సాక్షి పెద్దపల్లి: మీకు జ్వరం వచ్చినా.. జలుబు చేసినా.. తల నొప్పిగా ఉన్నా.. నిద్ర పట్టకున్నా.. ఇలా సమస్య ఏదైనా సరే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. మెడికల్ షాప్‌లకు వెళ్తే నాడీ పట్టకుండానే అవసరమైన మందులు ఇచ్చేస్తారు. డాక్టర్ చీటీ (ప్రిస్క్రిప్షన్) లేకుండా మందులు ఇవ్వకూడదనేది నిబంధన ఉన్నా.. కొందరు మెడికల్ దుకాణ నిర్వాహకులు.. అదేమీ పట్టించుకోకుండా యాంటీబయాటిక్స్ సహా అన్ని మెడిసిన్స్ విక్రయిస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి చెందిన మెడికల్ షాపులో తమ పిల్లవాడి కోసం తీసుకెళ్లిన సిరప్‌లో వ్యర్థాలు రావడంతో బాధితుడు లబోదిబోమంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల నిఘా పూర్తిగా కొరవడడంతో మెడికల్ షాపు ల నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నియంత్రణ లేక..
వైద్యం పేరిట వ్యాపారం చేసే కొన్నిహోల్‌సేల్ మందుల ఏజెన్సీలతోపాటు, మెడికల్ దుకాణాలపై ఔ షధ నియంత్రణ విభాగం అధికారుల నిఘా కొరవడింది. జిల్లాలో 500 వరకు మెడికల్ దుకాణాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తూ మందులు విక్రయిస్తున్నారనే విష యంపై తనిఖీలు లేకపోవడం అక్రమాలకు ఊతమిస్తోంది. ప్రస్తుతం మందుల షాపుల యజమానులు జనరిక్ ఇచ్చి బ్రాండెడ్ మందుల ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి.
బిల్లు ఇచ్చుడే లేదు
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదు. మందుల వివరాలతో కూడిన బిల్లును వినియోగదారురుకు ఇవ్వాలి. కానీ, జిల్లాలో ఒకట్రెండు మెడికల్ షాపుల్లో తప్ప మిగతా దుకాణాల్లో ఇది అమలు కావడం లేదు. నిరక్షరాస్యులు, వృద్ధుల అవసరాలను ఆసరాగా చేసుకుని మందుల దుకాణా నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బు గుంజుతున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు.. సిబ్బంది కొరత పేరిట తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మెడికల్ షాపును నిర్వహించే ఫార్మాసిస్టు డ్రెస్‌కోడ్‌తోపాటు మందులు అందించే సమయంలో గ్లౌస్‌లు వేసుకోవాలి. కొన్ని మందు లను ఫ్రిజ్‌లో మాత్రమే భద్రపరచాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు.
లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది
మెడికల్ షాప్‌లో బీ – ఫార్మసీ పూర్తిచేసిన వారే ఉంటూ మందులు ఇవ్వాలి. కానీ, జిల్లాలోని మందుల దుకాణా నిర్వాహకులు చాలావరకు అద్దెకు సర్టిఫికెట్లు తెచ్చుకొని, లైసెన్స్ తీసుకొని మెడికల్ దుకాణాలు నిర్వహిస్తున్న వారే అధికంగా ఉన్నారు. అలాగే మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే యాంటీబయాటిక్స్‌తో పాటు రెండు, మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
లైసెన్స్ రద్దు చేస్తాం
మెడికల్ దుకాణాల్లో ఫార్మాసిస్టు లేకున్నా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బిల్లులు, రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం.
– శ్రవణ్, డగ్ర్ ఇన్‌స్పెక్టర్
 
							మెడి‘కిల్’ దందా!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
