
కూలీలకు చేతినిండా పని
పనుల గుర్తింపునకు ప్రణాళిక 58 రకాలు చేపట్టేలా రూపకల్పన ప్రాధాన్యత పనుల్లో మార్పులకు శ్రీకారం ఆర్థికంగా బలోపేతమయ్యే వాటికే మొగ్గు పల్లెల్లో మొదలైన ఉపాధిహామీ గ్రామసభలు
మంథనిరూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు చేతినిండా పనికల్పించి ఆర్థిక భరోసా కల్పించేలా అమలు చేస్తున్న ఉపాధిహామీ ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి పనుల గుర్తింపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 2 నుంచే గ్రామసభలు నిర్వహించాల్సి ఉండగా స్థానిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాయిదా వేశారు. ఎన్నికలు కూడా వాయిదా పడడంతో ప్రతీగ్రామంలో సభ నిర్వహించి వచ్చే ఏడాది చేపట్టే పనుల గుర్తింపునకు శ్రీకారం చుట్టారు. నిబంధల ప్రకారం గ్రామసభ ద్వారా అందరి ఆమోదంతో పనులు గుర్తించనున్నారు.
35 గ్రామపంచాయతీల్లో
మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీల్లో పనుల గుర్తింపుకు ఉపాధి గ్రామ సభలు ప్రారంభయమయ్యాయి. మండలంలో 21,677 జాబ్ కార్డులు ఉండగా అందులో 14,012మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారు. వీరికి ప్రతీరోజు ఉపాధి కల్పించేలా పనులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
58 రకాల పనులు
గ్రామసభల ద్వారా గ్రామాల్లో ఈఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా 58రకాల పనుల గుర్తింనపు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాటికి సంబంధించిన అంచనాలను కూడా రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో ఎక్కువగా భవన నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, చెక్‌డ్యాంలు, నీటి సంరక్షణ పనులు, పాఠశాలల కాంపౌండ్ వాల్ తదితర పనులను చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు.
తగ్గనున్న పూడికతీత
గతంలో ఉపాధిహామీ ద్వారా చెరువులు, కుంటల్లో చేపట్టే పూడికతీత పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గనున్నాయి. ఏటా చెరువుల్లో పూడికతీతతో సత్పలితాలు రావడం లేదని, సోషల్ ఆడిట్‌లో సైతం తరచూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయని ఆ పనులకు ప్రాధాన్యం తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రామసభల ద్వారా పనులను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.
వచ్చేనెల 18లోగా గ్రామసభలు పూర్తిచేస్తాం
ఆయా గ్రామాల్లో ఉపాధి పనుల గుర్తింపునకు ఇటీవల సభలు ప్రారంభించాం. ప్రభుత్వం నుంచి 58 పనుల గుర్తింపునకు ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల మేరకు పనులను గ్రామస్తుల ఆమోదంతో గుర్తిస్తున్నాం. వచ్చేనెల 18వ తేదీలోగా గ్రామసభలను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నా.
– సదానందం, ఏపీవో, మంథని