
వెలుగుల వేడుక
పెద్దపల్లి/రామగిరి/రామగుండం/కాల్వశ్రీరాంపూర్: జిల్లావ్యాప్తంగా సోమవారం దీపావళి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాణిజ్య, వ్యాపారసంస్థలు, నివాసగృహాల్లో లక్ష్మిపూజలు నిర్వహించారు. మంగళవారం పలు ప్రాంతాల్లో కేదారేశ్వరస్వామి నోములు నోముకున్నారు. రాత్రిపూట చిన్నాపెద్ద టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఊశన్నపల్లెలో ముసుకు వంశానికి చెందిన 22 కుటుంబాలు ఒకేచోట కేదారేశ్వర నోములు నోముకున్నారు. రామగిరి మండలం సెంటినరికాలనీ జోన్–1లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. రామగుండంలో సమాధుల వద్ద దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో టపాసుల దుకాణాల వద్ద సందడి నెలకొంది.