 
															అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
గోదావరిఖని/కోల్‌సిటీ: రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూ ర్తిచేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి బుధవారం వారు నగరంలో విస్తృతంగా పర్యటించారు. గో దావరి తీరంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులు, శ్మశానవాటిక నిర్మాణం, రామగుండం మసీదు టర్నింగ్, జెడ్పీ హైస్కూల్, రైల్వేస్టేషన్ సమీప షాపింగ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ సమ్మక్క – సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలన్నారు. సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట జంక్షన్ అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. మసీదు టర్నింగ్ పాయింట్, షాపింగ్ కాంప్లెక్స్ పనులు వేగవంతంగా పూర్తి కావాలని అన్నారు. వీరివెంట అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
