
ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం
సుల్తానాబాద్(పెద్దపల్లి): వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈసారి జిల్లావ్యాప్తంగా 318 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించారు. ఈనెల 20 నుంచి ధాన్యం సేకరిస్తారు. ఇందుకోసం నిర్వాహకులు అన్నిఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. వానాకాలం దిగుబడి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు.
నిబంధనల మేరకు..
తప్ప, తాలు, రాళ్లు ఉన్నాయంటూ రైస్‌మిల్లర్లు ధా న్యం అన్‌లోడ్ చేసుకునేందుకు కొర్రీలు పెడుతున్నారనే గత ఆరోపణల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో వెళ్లే ధాన్యాన్ని వెంట నే అన్‌లోడ్ చేసుకునేలా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. గతసీజన్‌లో కోతలు లేకుండా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక చొరవ తీసుకున్న నేపథ్యంలో ఈసారి కూడా అలాగే వ్యవహరించాలని యోచిస్తున్నారు.
15న ఉద్యోగులకు శిక్షణ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ, డీసీఎంఎస్ ఉద్యోగులకు ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో ఈనెల 15వ తేదీన శిక్షణ ఇవ్వనున్నారు. తేమశాతం నిర్ధారణ చేయడం, ఎండిన ధాన్యం పరిశీలన, మిల్లింగ్ తదితర పద్ధతులపై ఇందులో అవగాహన కల్పిస్తారు. ఈనెల 20వ తేదీ తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని అంటున్నారు. ఆలోగా ధాన్యం వచ్చినా.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు.
సన్నరకమే అధికం..
క్వింటాలుపై రూ.500 బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈవానాకాలంలోనూ సన్నరకం ధాన్యం వైపే రైతులు మొగ్గుచూపారు. సమృద్ధిగా వర్షాలు కురవడం, చెరువులు, కుంటల్లోకి నీరు అధికంగా వచ్చిచేరడం, ఎస్సారె స్పీ కాలువల ద్వారా చివరి ఆయకట్టుకూ సాగునీ రు అందడంతో ధాన్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో సుమారు 3.60 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, దాదాపు 40 వేల వరకు దొడ్డురకం ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వీటికి అవసరమైన 30 లక్షల గన్నీసంచులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా అకాల వర్షాలు కురిసినా ధా న్యం తడవకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లావ్యాప్తంగా దాదాపు 7,700 టార్పాలిన్ కవ ర్లు అందుబాటులో ఉంచారు. మరో 2,300 వరకు అవసరం ఉందని భావిస్తున్నారు. ప్యాడి క్లీనర్లు, తేమకొలిచే యంత్రాలు, ఇతరత్రా యంత్రపరికరాలనూ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
హమాలీల కొరతను అధిగమించేందుకు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతీసీజన్‌లో హమాలీల కొరత నిర్వాహకులను, అధికారులను వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లా అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్థానిక హమాలీ సంఘాలతో చర్చించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం రవాణాకూ లారీల కొరత లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ధాన్యం తూకం వేసిన వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా 318 కొనుగోలు కేంద్రాలు
దిగుబడి అంచనా 4 లక్షల మెట్రిక్ టన్నులు
అందుబాటులో 7,700 టార్పాలిన్ కవర్లు
వడ్ల కోసం 30 లక్షల వరకు గన్నీసంచులు
కొనుగోళ్లపై ఈనెల 15న ఉద్యోగులకు శిక్షణ