
నాలుగేళ్లక్రితమే వెలుగులోకి
గోదావరిఖని: హైదరాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియంలో స్థానం సంపాదించిన అరుదైన స్టెగోడాన్ ఏనుగు శిలాజం సింగరేణి మేడిపల్లి ఓసీపీలో నాలుగేళ్ల క్రితం లభ్యమైందని సింగరేణి అధికారులు వివరించారు. సుమారు 110 లక్షల ఏళ్ల క్రితం నాటి స్టెగోడాన్ రకం ఏనుగు అవశేషాలతో కూడిన శిలాజం ఇది అని వారు భావిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్‌లోని మ్యూజియంలో ప్రత్యేక గుడారం(పెవిలియన్) ఏర్పాటు చేశారు.
ఓబీ తవ్వకాల సందర్భంగా..
సింగరేణి మేడిపల్లి ఓసీపీలో ఓబీ తవ్వకాల సందర్భంగా నాలుగేళ్ల క్రితం పొడవాటి కొమ్ములతో ఉ న్న నాలుగు శిలాజాలను ఉద్యోగులు గుర్తించారు. ఇవి పాతకాలం నాటి జంతు అవశేషాలుగా భావించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు పురావస్తు పరిశోధకులకు వాటిని చూపించారు. సుమారు 110 లక్షల సంవత్సరాల క్రితం ఈప్రాంతంలో జీవించి, దాదాపు 6,000 సంవత్సరాల క్రితం భూమి నుంచి అంతరించిపోయిన స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలుగా వారు గుర్తించారు. ఇప్పటి ఏనుగు దంతాలు సాధారణంగా రెండు లేదా మూడు అడుగుల పొడవు ఉంటుందని, నాటి ఏనుగు దంతాలు సుమారు 12 అడుగుల పొడవు వరకు ఉండేవని, ఏనుగు 13 అడుగుల ఎత్తు, 12.5 టన్నుల బరువు ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. స్టెగోడాన్ జాతి ఏనుగుల అవశేషాలు గతంలో నర్మదానది, దాని ఉపనది ప్రాంతంలోనూ, ప్రపంచంలో నాలుగైదు ప్రదేశాల్లోనూ లభించాయంటున్నా. సింగరేణిలో లభ్యమైన స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాల్లో ఒకజతను బిర్లా మ్యూజియానికి సీఎండీ బలరాం అందజేశారు. గతంలో లభించిన జతదంతాలను నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు అప్పగించారు.
సింగరేణి ప్రత్యేక హాల్..
ఓసీపీలో లభించిన ఏనుగు అవశేషాలతో ప్రత్యేక గుడారాన్ని సింగరేని సీఎండీ బలరాం, బిర్లా సైన్స్ సెంటర్ చైర్ పర్సన్ నిర్మలా బిర్లా ఇటీవల ప్రారంభించారు. దీనితోపాటు డైనసోర్ కాలానికి చెందిన శిలాజ కలపను పొందుపరుస్తూ బిర్లా సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు.
మేడిపల్లి ఓసీపీలో అరుదైన శిలాజం లభ్యం
బిర్లా సైన్స్ మ్యూజియానికి అప్పగించిన వైనం
110 లక్షల ఏళ్లనాటి స్టెగోడాన్ ఏనుగుగా గుర్తింపు