
ఇక ‘ఏఐ’తో పశువైద్యం!
పశువు ఫొటో అప్‌లోడ్ చేస్తే వ్యాధిగుర్తింపు పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని నాలుగు మండలాలు పాడిరైతులు నేరుగా అప్‌లోడ్ చేసే అవకాశం యాప్‌నకు ‘ఆరోగ్య వైద్యరేఖ’గా నామకరణం కలెక్టరేట్‌లో లోగో ఆవిష్కరించిన అధికారులు
పెద్దపల్లిరూరల్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగించి రూపొందించిన యాప్ ద్వారా పాడిరైతు పశువు ఫొటోతీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు.. ఆ పశువుకు ఏ రకమైన వ్యాధి సోకింది, దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వివరాలన్నీ వెల్లడిస్తుంది.
దేశంలోనే తొలిసారి..
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అమలుకు శ్రీకారం చుడుతోంది. జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసేందుకు నిర్ణయించింది. సుమారు ఏడెనిమిది నెలల క్రితం ఈ ప్రక్రియ చేపట్టారు. మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ చొరవతో ఏఐ సాంకేతికతతో మూగజీవాలకు నాణ్యమైన వైద్యం సకాలంలో అందించేందుకు కొత్త విధానం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఆ నాలుగు మండలాల్లోని 132 మంది పాడిరైతులకు చెందిన 451 పశువులకు సంబంధించిన 1,600 ఫొటోలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారని అధికారులు తెలిపారు.
‘ఆరోగ్య వైద్యరేఖ’ యాప్ రూపకల్పన
జిల్లాలో ప్రయోగాత్మకంగా పశుసంవర్థక శాఖ ద్వారా మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏఐ సాంకేతికతతో 9 నెలల్లో ఆరోగ్య వైద్యరేఖ యాప్ రూపొందించారు. క్యాటిల్ హెల్త్ మానిటరింగ్ ఇంటలిజెన్స్(సీహెచ్‌ఎం ఐటీ) పశు వుల సమాచారాన్ని ఏ మేర సేకరించి యాప్‌లో నమోదు చేయగలిగితే ఏఐ టూల్స్ అంత మెరుగ్గా సమాచారం అందిస్తుందని జిల్లాస్థాయి అధికారులు చెబుతున్నారు.
మేలుజాతి పశువుల సంతానోత్పత్తికి..
ఈ యాప్ ద్వారా పశువు ఎదను సకాలంలో గుర్తించి కృత్రిమ గర్భాధారణ చేస్తే మేలుజాతి ఆడదూడలను ఉత్పత్తి చేయడం సులువని పశువైద్యాధికారులు అంటున్నారు. గర్భకోశవ్యాధులను గుర్తించి గొడ్డుమోతుతనాన్ని కూడా నియంత్రించి పశువు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ విధానం దోహపడుతుందని అంటున్నారు.
సకాలంలో వైద్యసేవలు అందించేలా..
పశువులు, గొర్రెలు, ఇతర మూగజీవాలు వ్యాధుల బారిన పడితే వాటి ఫొటోను యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. ఆ వెంటనే గోపాలమిత్ర, పశువైద్యాధికారులు, ఏఐ బృందం, కలెక్టర్‌కు సమాచారం చేరుతుంది. ఇంటర్నెట్ లేని ఫోన్లలోనూ ఫొటో తీస్తే లొకేషన్ మారదని, ఇంటర్నెట్ ఉన్న స్థలం నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఈ విధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు అఽధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణకు సిద్ధమవుతోంది.
లోగో ఆవిష్కరణ
పశువులకు సోకిన వ్యాధిని గుర్తించి సకాలంలో వైద్యం అందించేందుకు రూపొందించిన ఆరోగ్యవైద్యరేఖ యాప్‌ను కలెక్టర్ శ్రీహర్ష, నీర్ సంస్థ సీఈవో జయశంకర్, రాంచందర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి విజయభాస్కర్ సోమవారం ఆవిష్కరించారు.
జిల్లా సమాచారం