
సింగరేణి అధికారులకు పీఆర్పీ
● గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం కార్యాలయం
ఏడాది చెల్లింపులు(రూ.కోట్లలో) 2022–23 110 2023–24 170
గోదావరిఖని: సింగరేణిలోని 2,500 మంది అధికారులకు రెండేళ్ల పీఆర్పీ చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈమేరకు ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్(పీఆర్పీ) చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫైల్‌పై సోమవారం సీఎం సంతకం చేసినట్లు చెబుతున్నారు. పీఆర్పీ కోసం అధికారుల సంఘం నాయకులు సింగరేణిలో కొద్దిరోజులుగా దశలవారీగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన రక్షణ వార్షికోత్సవంలో అధికారులకు అతి త్వరలో పీఆర్పీ చెల్లిస్తామని సింగరేణీ సీఎండీ బలరాం హామీ ఇచ్చారు. దీనిపై దృష్టి సారించిన ఆయన.. ఫైల్ కదలికలో వేగం పెంచారు. మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వద్ద ఫైల్‌కు క్లియరెన్స్ లభించింది. మరో రెండు రోజుల్లో యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. కాగా, ఒక్కో అధికారి సీనియార్టీ, హోదాను బట్టి సుమారు రూ.2 లక్షల నుంచి రూ. రూ.10లక్షల వరకు పీఆర్పీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కాగా 2007–2014 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన పీఆర్పీ రూ.35కోట్లు కూడా చెల్లించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.